పారిస్ పై ఉగ్రవాదులు దాడులు చేసి 129 మంది ప్రజలను హతమార్చినందుకు ఫ్రాన్స్ దేశం ప్రతీకారంతో రగిలిపోతోంది. అలాగే సుమారు 224 మంది ప్రయాణికులతో వెళుతున్న తమ విమానాన్ని కూల్చేసినందుకు రష్యా కూడా ఉగ్రవాదులపై పగతో రగిలిపోతోంది. ఇక ఫాథర్ ఆఫ్ అల్ వార్స్ అని గొప్ప పేరు సంపాదించుకొన్న అమెరికా సంగతి చెప్పనవసరం లేదు. ఆ మూడు దేశాలు కలిసి సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తూ అనేకమంది ఉగ్రవాదులను హతమార్చి ప్రతీకారం తీర్చుకొంటున్నాయి.
ఆ వైమానిక దాడులను చూసి ఐసిస్ ఉగ్రవాదులు ఏమాత్రం భయపడకపోగా త్వరలో వాషింగ్టన్ నగరంపై, వైట్ హౌస్ పై దాడులు చేస్తామని హెచ్చరించాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండీ శిరస్సులు ఖండిస్తామని హెచ్చరించాయి. ఐసిస్ ఉగ్రవాదులు మళ్ళీ తాజాగా మరొక హెచ్చరిక కూడా జారీ చేసారు. ఈసారి రైజ్ ఆఫ్ కోబ్రా పేరిట ఒక వీడియో క్లిప్పింగ్ విడుదల చేసారు. ఈఫిల్ టవర్ ని రోబోటిక్ పరికరాలతో అందరూ చూస్తుండగానే కూల్చివేస్తామని ఆ వీడియోలో హెచ్చరించారు. ఇంతవరకు ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో విద్వంసం సృష్టించబోతున్నామని హెచ్చరించారు. చాలా పటిష్టమయిన భద్రత కలిగిన పారిస్ నగరంపైనే వారు దాడులు చేయగలిగినందున, యూరోప్ దేశాలు వారి హెచ్చరికలను చాలా తీవ్రంగా పరిగణించి అందుకు తగ్గట్లుగా భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్థం చేసుకొంటున్నాయి. భారత్ లో మెట్రో నగరాలపై కూడా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని, కనుక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతను మరింత పటిష్టం చేసుకోమని సోమవారం కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకు ముందు దేశంలో ప్రధాన పుణ్యక్షేత్రాలపై దాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేసాయి. ఉగ్రవాదులపై అగ్రరాజ్యాలు ఎంతగా బాంబుల వర్షం కురిపిస్తున్నా వాళ్ళు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేయగలుగుతున్నారు.