ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ ఐసిస్ నేరుగా అమెరికానే బెదిరించింది. సెప్టెంబర్ 11 తరహా దాడులు చేస్తామని హెచ్చరించింది. అమెరికాపై అల్ ఖైదా దాడులు చేసి 14 ఏళ్లయిన సందర్భంగా ఐసిస్ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో అమెరికాను బెదిరిస్తూ పలు వ్యాఖ్యలుచేసింది. అమెరికాపై సెప్టెంబర్ 11 తరహా దాడులు పునరావృతం చేస్తామని, అందుకోసం కారు బాంబులు, మానవ బాంబులు పంపుతామని వీడియోలో హెచ్చరించారు. అమెరికాలో అన్ని మూలల్లో జీహాదీ మానవ బాంబులు విరుచుకు పడే రోజు వస్తుందట. ప్రపంచంలోని జీహాదీలందరూ ఏకమై అమెరికాను సర్వనాశనం చేయడానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు.
అమెరికన్లను, క్రైస్తవులను, యూదులను ప్రతి ముస్లిం ద్వేషించే రోజులు వస్తాయని , అప్పుడు అమెరికా మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని తీవ్రమైన వ్యాఖ్యలుచేశారు. అమెరికాపై ఐసిస్ కు ఎంత కోపం ఉందో వీడియో సందేశం వింటే అర్థమవుతుంది. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై యుద్ధంలో అమెరికా చురుగ్గా పాల్గొంటోంది. అమెరికా వైమానిక దాడుల్లో వందల మంది ఉగ్రవాదులు హతమయయారు. దీంతో అమెరికాపై ఐసిస్ పగబట్టినట్టు కనిపిస్తోంది.
ఐసిస్ వీడియో సందేశంలో చెప్పినట్టు మానవ బాంబును పంపడానికి ప్రయత్నిస్తే అది అమెరికాకు పెను సవాలే అవుతుంది. అయితే అమెరికాలోకి బాంబులతో ప్రవేశించడం అంత సులభం కాదు. మరి ఏ మార్గంలో మానవబాంబులను పంపడానికి ప్రయత్నిస్తారో తెలియదు. నిజంగానే ఆ ఉగ్రవాద సంస్థ ఇలాంటి వ్యూహం రచిస్తోందా లేక కేవలం అమెరికా మీద తన అక్కసు తీర్చుకోవడానికి ఓ వీడియోను ఆన్ లైన్లోకి వదిలిందా అనేది కూడా అనుమానాస్పదమే.