పూరీ జగన్నాథ్ కెరీర్లోనే ది బెస్ట్ ఫిల్మ్ ఇజం అని కళ్యాణ్ రామ్ చెప్పాడు. అలాగే కళ్యాణ్ రామ్ యాక్టింగ్ గురించి ఇజంకు ముందు, ఇజంకి తర్వాత అని అందరూ చెప్పుకుంటారు, ఆ స్థాయిలో కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ ఉందని పూరీ జగన్నాథ్ చెెప్పాడు. ఇజం సినిమాలో మేం చూపించినటువంటి అవినీతిని ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ చూపించలేదని కూడా పూరీ జగన్నాథ్ చెప్పాడు. ఇంతకుముందు తీసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అయినప్పుడు, ఇప్పుడు తీసిన సినిమా గురించి ఆ మాత్రం చెప్పుకోకపోతే ప్రేక్షకులను నమ్మించడం, థియేటర్‌కి రప్పించడం చాలా కష్టం. మరి అలా నమ్మి థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకులకు కళ్యాణ్‌రామ్-పూరీ జగన్నాథ్‌లు ఎలాంటి సినిమా చూపించారు? తర్వాత చేయబోయే సినిమాకు ఇంకా భయంకరమైన పబ్లిసిటీ చేయాల్సిన అవసరం పడేలా ఫ్లాప్ సినిమా తీశారా? లేక నిజంగానే వీళ్ళు పబ్లిసిటీ చేసిన రేంజ్లో ‘ఇజం’ సినిమా ఉందా? పోకిరి సినిమా తర్వాత నుంచీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చిన పూరీ జగన్నాథ్ కథ ఒక్కటి కూడా లేదు. మరి ఈ పూరీయిజం ఆలోచనలు అందరికీ నచ్చే ఛాన్స్ ఉందా? కనీసం గురుశిష్యులు పూరీ-వర్మల భక్తులకైనా నచ్చే ఛాన్స్ ఉందా?
కథః ఒక చిన్న పాయింట్ చుట్టూ కథనం అల్లుకోవడం పూరీ స్టైల్. ఈ సారి కూడా అలానే చేశాడు. ఆ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన వికిలీక్స్ ఎపిసోడ్‌ని ఇన్స్పిరేషన్గా తీసుకుని దాని చుట్టూ కథనం అల్లుకున్నాడు. దేశంలో బోలెడుమంది లుచ్ఛాస్, లఫంగాస్, క్రిమినల్స్…ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు, నాయకులందరూ అవినీతిపరులే, బిజినెస్ పీపుల్, ఇంకా బోలెడు మంది క్రిమినల్స్ చేస్తున్న క్రైమ్స్‌ని బయట పెట్టే ఓ పవర్ఫుల్ జర్నలిస్ట్ (కళ్యాణ్ రామ్). ఆ జర్నలిస్ట్ ఎవరు? ఆ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నాడు? క్రిమినల్ యాక్టివిటీస్‌ని బయటపెట్టటంతోనే ఆగాడా? అంతకుమించి ఇంకా ఏమైనా చేశాడా? అతని లవ్ స్టోరీ ఏంటి? అన్నదే ఇజం సినిమా.
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ః కళ్యాణ్ రామ్‌కి ఇది చాలా స్పెషల్ సినిమా. టఫ్ జర్నలిస్ట్‌గా కనిపించడం కోసం అతను చేసిన ప్రతి కష్టం కూడా సినిమాకు హెల్ప్ అయింది. కొన్ని సీన్స్‌లో అద్భుతంగా నటించాడని చెప్పొచ్చు. ఓవరాల్‌గా మెప్పిస్తాడు. ఈ క్యారెక్టర్‌కి మాత్రం ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరమే. సిక్స్ ప్యాక్ ఒక్కటే కాదు, బాడీ లాంగ్వేజ్‌ని కూడా చాలా మార్చుకున్నాడు ఈ నందమూరి హీరో. డైలాగ్ డెలివరీ విషయంలో కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు. హీరోయిన్ కూడా ఒకె. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం ముందుగా ప్రకాష్ రాజ్‌ని అనుకున్నాడు పూరీ. అయితే నందమూరి వారి సలహాతో జగపతిబాబుని ఫైనల్ చేశాడు. అది సినిమాకు ప్లస్సే అయింది. ప్రకాష్ రాజ్ అయితే మరీ రొటీన్ అయిపోయి ఉండేది. తనికెళ్ళ భరణి, గొల్లపూడి మారుతీరావుల యాక్టింగ్ చాలా బాగుందని ప్రత్యేకంగా చెప్పాలా? వాళ్ళు యాక్ట్ చేయడం ఇజంకి చాలా ప్లస్ అయింది.
టెక్నికల్ పెర్ఫార్మెన్స్ః పూరీ జగన్నాథ్ సినిమాలన్నీ కూడా టెక్నికల్‌గా హై స్టాండర్ట్స్లోనే ఉంటాయి. ఈ సినిమాలో కూడా సేం టు సేం. ఫొటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన సాంగ్స్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక పూరీ జగన్నాథ్ స్వయంగా రాసుకున్న కథ, కథనం, మాటల విషయానికొస్తే డైలాగ్స్‌కి మాత్రం వందకు వంద మార్కులూ ఇవ్వొచ్చు. హీరో క్యారెక్టరైజేషన్ విషయం పక్కన పెడితే మిగతా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా రెగ్యులర్‌గా పూరీ సినిమాల్లో కనిపించే స్టైల్లోనే ఉంటాయి. ఇక పోకిరి సినిమా నుంచి రీసెంట్గా పూరీ తీసిన టెంపర్ వరకూ తన సినిమాలన్నీ కూడా గుర్తొచ్చేలా చేస్తూ సాగుతుంది పూరీ రచనా శైలి అండ్ సినిమాను తెరకెక్కించిన విధానం. రాబోయే సినిమాలలో అయినా పాత సినిమాలు గుర్తు రాకుండా ఉండేలా ప్రయత్నం చేయాల్సిన అవసరం పూరీకి ఉంది. లేకపోతే ఆయన సినిమాల స్టాండర్డ్స్ తగ్గిపోతూ ఉంటాయి.
హైలైట్స్ః పూరీ జగన్నాథ్ తీసుకున్న పాయింట్
- పూరీ జగన్నాథ్ డైలాగ్స్
- కళ్యాణ్ రామ్
- ఇంటర్వెల్ ఎపిసోడ్
- ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్
- టెక్నికల్ బ్రిలియన్స్
డ్రా బ్యాక్స్ః ఎంత కొత్త కథను అయినా తన పాత స్టైల్లోనే చెప్పే పూరీ అలవాటు
- క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా రెగ్యులర్ పూరీ సినిమాల్లో కనిపించే స్టైల్లోనే ఉండడం
- కొన్ని సీన్స్ అండ్ సాంగ్స్ కూడా పూరీ పాత సినిమాలను గుర్తు చే్స్తూ ఉండడం
- లాజిక్కులు లేకపోవడం అని ఇక్కడ చెప్పుకోవడం అనవసరం కానీ పరమ సిల్లీగా ఉండే కొన్ని సీన్స్ మాత్రం సినిమా స్థాయిని తగ్గించాయి
ఎనాలసిస్ః పోకిరి సినిమా తర్వాత నుంచి పాత కథకు తన మార్క్ రొటీన్ క్యారెక్టరైజేషన్స్‌తో, రొటీన్ సీన్స్‌తో సినిమాలు తెరకెక్కించడం పూరీకి బాగా అలవాటైపోయింది. ఆ హ్యాంగోవర్ నుంచి అస్సలు బయటపడలేకపోతున్నాడు. ఈ మధ్య వచ్చిన టెంపర్‌లో ఉన్న కొత్తదనమంతా కూడా వక్కంతం వంశీది. అయితే ఇప్పుడు ఇజం సినిమాతో మాత్రం కాస్త కొత్తగా ట్రై చేశాడు పూరీ. లవ్, కామెడీ సీన్స్ విషయంలో మాత్రం… వాళ్ళే చూసేస్తార్లే అనే పూరీ కేర్లెస్ యాటిట్యూడ్ ఈ సినిమాలోనూ కనిపించింది కానీ, కథకు సంబంధించిన ముఖ్యమైన సీన్స్ విషయంలో మాత్రం చాలా బాగావర్క్ చేశాడు. ఆ సీన్స్ వరకూ పూరీ రాసుకున్న డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో బ్రిటీషువాళ్ళు దోచుకోవడం గురించి, స్వాతంత్ర్యం వచ్చాక మనవాళ్ళు దోచుకోవడం గురించి పోలుస్తూ రాసిన డైలాగ్స్కైతో థియేటర్లో విజిల్స్ మోత మోగింది. ఇంకా చాలా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి.
జర్నలిజం గురించి కూడా బాగా చెప్పాడు. సీరియస్ గా తెరకెక్కించాల్సిన కథే అయినప్పటికీ పూరీ మార్క్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో సినిమాని చాలా వరకూ ఆసక్తికరంగా మలిచాడు. సెకండ్ హాఫ్‌లో పది నిమిషాల సినిమా మాత్రం కాస్త డాక్యుమెంటరీని తలపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ట్రాక్, సీన్స్ అన్నీ కూడా యావరేజ్‌గా ఉన్నాయి. ఇక అలీ ట్రాక్ అయితే పరమ సిల్లీగా ఉంది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే బిజినెస్ మేన్ లాంటి సినిమాలను ఇష్టపడేవాళ్ళకు ఈ ఇజం కూడా బాగా నచ్చుతుంది. ఓవరాల్‌గా కూడా ఒకసారి చూడొచ్చు అనే తరహా సినిమా. ఇజం సినిమా కోసం పూరీ ఈ మధ్య కాలంలో తను తీసిన సినిమాలన్నింటికంటే కూడా కాస్త ఎక్కువ వర్క్ చేశాడని, శ్రద్ధ పెట్టాడని వార్తలు వచ్చాయి. అవన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. అందుకే ‘ఇజం’ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టెక్కే స్థాయిలోనే ఉంది.
రిజల్ట్ః నిర్మాతగా, హీరోగా కళ్యాణ్ రామ్ చాలా కష్టపడ్డాడు. పూరీ కష్టపడ్డాడు. ఇద్దరూ కలిసి ఇజంని ఇష్టపడేలానే చేశారు. ఫర్వాలేదు.
రిలీజ్ డేట్ః 21.10.2016
కథ, కథనం, మాటలు, దర్శకత్వంః పూరీ జగన్నాథ్
మ్యూజిక్ః అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫర్ ముఖేష్
ఎడిటర్ః జునైద్
ప్రొడక్షన్ హౌస్ః ఎన్టిఆర్ ఆర్ట్స్
నటీనటులుః నందమూరి కళ్యాణ్ రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, తనికెళ్ళభరణి, గొల్లపూడి మారుతీరావు……..
తెలుగు360 రేటింగ్ : 2.5/5