డూ ఆర్ డై పరిస్థితులు పూరికి చాలాసార్లు వచ్చాయి. విజయమో వీర స్వర్గమో అనుకునే పరిస్థితుల్లో కసిగా హిట్టు కొట్టాడు పూరి. `టెంపర్`కి ముందు పూరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. `టెంపర్` తరవాత ఒక్క హిట్టూ లేదు. నానాటికీ తీసికట్టులాంటి సినిమాలు తీస్తూ తన ఇమేజ్‌కి తానే గోతులు తవ్వుకుంటూ వస్తున్నాడు పూరి. ఈసారి `ఇస్మార్ట్ శంకర్`పైనే తన భరోసా పెట్టుకున్నాడు. ఈ సినిమాని నిర్మాత కూడా తనే.
రెగ్యులర్ కథల్ని పక్కన పెట్టి, కాస్త సైన్స్ ఫిక్షన్ జోడించిన, మాస్ హీరోయిజం ఉన్న కథని ఎంచుకున్నాడు పూరి. టీజర్, ట్రైలర్లలో ఆ ఎనర్జీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పూరి సినిమాల్లో హీరో ఏ స్థాయిలో రెచ్చిపోతాడో, అందుకు పదిరెట్లు ఎక్కువ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు రామ్. తెలంగాణ నేపథ్యాన్ని వాడుకున్న సినిమాలన్నీ ఈమధ్య బాగా హిట్టవుతున్నాయి. ఆ రకంగానూ `ఇస్మార్ట్ శంకర్`కి కలిసొస్తుంది. అంతేనా.?? అటు నిధి, ఇటు నభా ఇద్దరూ నువ్వా, నేనా? అన్నట్టు పోటీ పడుతూ గ్లామర్ పండించేస్తున్నారు. పక్కా కమర్షియల్ సూత్రాలతో ఓ కొత్త కథని చెప్పడానికి పూరి ప్రయత్నించాడు. ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గురి తప్పకూడదు. ఎందుకంటే ఎప్పటిలా తన ఆస్తుల్ని పణంగా పెట్టి ఈ సినిమా తీస్తున్నాడు పూరి. తిరోగమన దశలో వెళ్తున్న పూరి కెరీర్‌ని మారిస్తే గీరిస్తే ఇస్మార్ట్ శంకరే మార్చాలి. లేదంటే.. పూరి అథః పాతాళానికి దిగజారిపోవడం ఖాయం. బజ్ చూస్తుంటే.. పూరి ఫామ్‌లోకి రావడానికి ఓ అవకాశం వస్తున్నట్టే కనిపిస్తోంది. రామ్‌కి కూడా ఈ సినిమా చాలా కీలకం. మరి వీరిద్దరి జాతకాల్నీ ఈ సినిమా ఎంత వరకూ ప్రభావితం చేస్తుందో చూడాలి.