హీరోయిజాన్ని ఓ లెవిల్లో చూపించడంలో పూరి జగన్నాథ్ తరవాతే ఎవరైనా. మాసిజంలో మాస్టర్ డిగ్రీ చేసేశారాయన. పూరి సినిమాల్లో టైటిల్ సాంగ్స్ అన్నీ బాగుంటాయి. ఆ పాటల్లోనే హీరో క్యారెక్టరైజేషన్‌ని పీక్స్‌కి తీసుకెళ్లిపోతారు. అందుకే పూరి సినిమాల్లోని టైటిల్ సాంగ్స్ వింటే ఓ జోష్ వచ్చేస్తుంది. `ఇస్మార్ట్ శంకర్` కోసం కూడా అలాంటి పాటే పుట్టింది. మణిశర్మ సంగీత సారథ్యంలో, పూరి ఆస్థాన రచయిత భాస్కరభట్ల రవికుమార్ ఈ పాట రాశారు. పాత బస్తీ పదాలు, హైదరాబాద్ గల్లీ పోరగాళ్ల భాష, హిందీ, ఉర్దూ సంస్క్కృతిని మిక్స్ చేసే యాస.. ఇవన్నీ కలగలిపి, వాటిలో హీరోయిజం మిక్స్ చేసి ఈ పాటని రాశారు. పాడిన విధానం, ఆ పాటని స్వరపరచిన పద్ధతి రెండూ.. మాస్‌కి నచ్చేలా ఉన్నాయి.
ఏదైనాగానీ మేటరు
చాయ్ బత్తీపై సెటిలు – అంటూ తొలిచరణంలో ఓ లైన్ ఉంది. పాత బస్తీలో ఎలాంటి సెటిల్మెంటైనా ఇరానీ కేఫ్‌లో జరిగిపోతుంది అనడానికి ఈ లైన్ వాడారు.
గడ్బిగ్లకు బేఫికర్
సడక్ సడక్ కడక్ పొగర్
ఇస్టయిల్ దేఖో నీచే ఊపర్
ఇష్ ఇష్ ఇస్మార్టూ… అంటే తెలుగుని కాస్త ఉర్దూకరించి రాయడం వల్ల… ఈ పాట కాస్త కొత్తగా వినిపిస్తోంది. ఈ పాటలో బీరూ ఉంది, పాత బస్తీలు ఎంతగానో ఇష్టపడే ఖద్దూకీ ఖీరూ ఉంది.
లవ్ చేస్తా రాత్రీ పగల్
కొని ఇస్తా కిలో నగల్
నడుం చూస్తే సెంటీమీటర్
వెనకొస్తా కిలో మీటర్
గిఫ్టిస్తా సెవెన్ సీటర్ అంటూ కాస్త చమత్కారాన్నీ రంగరించారు. మొత్తానికి మాస్‌కి నచ్చే పాట ఇది. తెరపై దాన్ని పూరి ఏ స్టైల్లో తీస్తాడో చూడాలి