ఓ విజయం కోసం ఆవురావురుమని ఎదురుచూస్తున్నాడు పూరి జగన్నాథ్. ‘టెంపర్’ తరవాత.. తన టెంపోకి తగిన సినిమా పడలేదు. తనయుడితో తీసిన `మెహబూబా` ఆర్థికంగానూ నష్టపరిచింది. ఇప్పుడు రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ మొదలెట్టాడు. ఈ సినిమాకీ తనే నిర్మాత. తన స్టైల్లోనే చక చక ఈ సినిమాని పూర్తి చేసి మేలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు పూరి.
‘ఇస్మార్ట్ శంకర్’ అటు దర్శకుడిగా ఇటు నిర్మాతగా పూరి కెరీర్లో కీలకమైన సినిమా. అందుకే కథ విషయంలో ఇది వరకటికంటే కాస్త ఎక్కువగానే శ్రద్ధ పెట్టినట్టు టాక్. పూరి ఫార్ములాతో నడిచే ‘ట్విస్టు’ల కథ ఇది. ‘పోకిరి’ గుర్తుంది కదా? ప్రీ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్టుకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ‘టెంపర్’లోనూ ఇలాంటి ట్విస్టే ఉంది. అప్పటి వరకూ కథ ఓ టెంపోలో సాగితే… క్లైమాక్స్ వచ్చేసరికి పీక్స్‌కి వచ్చేస్తుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా అదే ఫార్ములాలో సాగుతుందట. క్లైమాక్స్‌లో ఈ కథ నడవడిక ఒక్కసారిగా మారిపోతుందని టాక్. అంతేకాదు… సినిమా మొత్తంలో ట్విస్టులు ఎక్కువే ఉన్నాయట. నిజానికి ఇది తన తనయుడు పూరి ఆకాష్ కోసం రాసుకున్న కథ. కాకపోతే… ఆకాష్ ఈ కథ చేయాలంటే ఇంకొంత కాలం ఆగాలి. అంత కాలం ఆగే ఓపిక లేక.. పూరి.. రామ్‌తో ‘సై’ అన్నాడు. మరి పోకిరి తరహా ట్విస్టులు పూరిని ఎంత వరకూ ఆదుకుంటాయో చూడాలి.