2004 నవంబర్ లో ఫ్రాన్స్ లోని ఒక మిలటరీ ఆసుపత్రిలో అరాఫత్ చనిపోవడం పాలస్తీనా వాసుల్ల ని శోక సంద్రం లో ముంచెత్తింది. వేలాది మంది పాలస్తీనా వాసులు తన మృతదేహాన్ని ఉంచిన రమల్లా వీధుల్లోకి తరలి వచ్చారు. దేశమంతా 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. దేశం లోని వివిధ రాజకీయ పార్టీలన్ని (అరాఫత్ ని శత్రువు గా పరిగణించే హమాస్ తో సహా) తాత్కాలికంగానే అయినా ఒక్క త్రాటి మీదకి వచ్చి ఐక్యతని ప్రదర్శించాయి. ఒక దిగ్గజం లాంటి నాయకుడు చనిపోయినప్పుడు చరిత్ర లో పలు చోట్ల, పలు మార్లు మార్లు జరిగిన పరిణామాలే ఇక్కడా పునరావృతం అయ్యాయి.
క్రైం థ్రిల్లర్ ని తలపించే కుట్ర కోణం, చనిపోయిన 8 సం|| తర్వాత శవాన్ని బయటకి తీసి పరీక్షలు:
2004 కి కొద్ది సంవత్సరాల ముందు నుంచే అరాఫత్ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీంతొ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం ఫ్రాన్స్ లోని మిలిటరీ ఆస్పత్రి లో చేరారు. గుండె పోటు తో ఆయన చనిపోయాడని అధికారికంగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించినప్పటికీ, క్రైం థ్రిల్లర్ ని తలపించే స్థాయిలో ఈయన మరణంపై కుట్ర కోణాల ఊహగానాలు వచ్చాయి. ఆయన పై విషప్రయోగం జరిగిందన్న పుకార్లు దేశమంతా బలంగా వినిపించాయి. ఆయన చనిపోయిన కొంత కాలం తర్వాత ఆయనకు సంబంధించిన వస్తువుల లో పోలోనియం-210 అనే రేడియో ధార్మిక పదార్థ అవశేషాలు లభించడం తో అరాఫత్ ని విష ప్రయోగం చేసి చంపారు అంటూ మొదట్లో వచ్చిన పుకార్ల కి విపరీతంగా బలం చేకూరింది. ఇజ్రాయిల్ దేశం అరాఫత్ ని కుట్ర చేసి చంపిందని కొందరు అంటే, పాలస్తీనా లోని రాజకీయ ప్రత్యర్థులే ఈయనను చంపించి ఉంటారని మరి కొందరు ఊహాగానాలు లేవనెత్తారు.
ఈ వివాదం మరింతగా ముదరడంతో 2012 లో, అంటే ఆయన చనిపోయిన ఎనిమిది సంవత్సరాల తర్వాత, మళ్లీ శవాన్ని బయటకు తీసి ఆయన చావు కి కారణాలు ఏంటి అన్న దాని పై ఫోరెన్సిక్ పరీక్షలు చేశారు. అయితే స్విట్జర్లాండ్, రష్యా మరియు ఫ్రెంచ్ ఫోరెన్సిక్ టీం లు సంయుక్తంగా నిర్వహించిన ఈ పరీక్షలు విష ప్రయోగం జరిగిందనే కుట్ర కోణాన్ని నిర్ధారించ లేదు, అలాగని కొట్టివేయనూ లేదు.
యాసర్ అరాఫత్ మరణానంతరం మారిన రాజకీయ పరిస్థితులు :
2004 లో యాసర్ అరాఫత్ మరణానంతరం, పాలస్తీనా రాజకీయాల లో అనేక ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 2005 లో పాలస్తీనా అథారిటీ కి ప్రత్యేక మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల లో మహమూద్ అబ్బాస్ పాలస్తీనా అథారిటీ కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తన రాజకీయ జీవితం లోని తొలి భాగం తో పోలిస్తే తన చివరి రోజుల్లో అరాఫత్ కొంత మిత వాదాన్ని ప్రదర్శిస్తే, ఆయన తర్వాత అధికారాన్ని చేపట్టిన అబ్బాస్ మరింత మిత వాద విధానాన్ని అనుసరించాడు. ఇజ్రాయెల్ తో చర్చల విషయం లో మరి కొంచెం పురోగతి సాధించాడు.. ఈ మితవాద వైఖరి అరాఫత్, అబ్బాస్ లకి చెందిన ఫతా పార్టీ తో రాజకీయంగా విభేదించే అతివాద హమాస్ పార్టీ బలోపేతం కావటానికి కారణమైంది
అరాఫత్ సమయం లో ఇజ్రాయేల్- పాలస్తీనా వివాదం ఒక కొలిక్కి వచ్చినప్పటికీ, ఫతా పార్టీ తర్వాత వచ్చిన హమాస్ పార్టీ ఈ వివాదాన్ని మళ్ళీ మొదటి కి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇజ్రాయేల్ తో ఎడ తెగని యుద్దం చేస్తున్న ఈ హమాస్ పార్టీ ఏంటి ? అసలు ఇది ఎందుకు పుట్టుకొచ్చింది ? అన్న విషయాలని తదుపరి ఆర్టికల్ లో చూద్దాం.
(సశేషం)
– జురాన్ (@CriticZuran)
Also Read చరిత్ర పుటలు: ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం, కారణాలు, సమగ్ర విశ్లేషణ (పార్ట్-1)
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-2) : ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఒక యూదా రాజ్యం
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-3) : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనా ప్రాంతం గా ఎలా మారింది ?
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -4): మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఆధీనంలోనికి ఈ ప్రాంతం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -5) : మొదటి ప్రపంచ యుద్ధాంతర పరిస్థితులు, హిట్లర్, యూదుల ఊచకోత
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -6) : రెండో ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ ఏర్పాటుకి మార్గం సుగమం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 8): పాలస్తీనా శరణార్థుల సమస్య
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 9): ఆరు రోజుల యుద్ధం , శిబిరాల్లో శరణార్థుల జీవితం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-10): యాసర్ అరాఫత్ అను ఒక విరోధాభాసం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-11): ఓస్లో ఒప్పందాలు, పాలస్తీనా విమోచన, అరాఫత్ ప్రభుత్వం