మొదటి ప్రపంచ యుద్ధంలో ఓట్టమన్ సామ్రాజ్యం, జర్మనీ, టర్కీలు ( Central Powers) ఒక వైపు ఉంటే బ్రిటన్, ఫ్రాన్స్ యూఎస్, రష్యా తదితర రాజ్యాలు అవతలి వైపు (Allied Powers) ఉన్నాయి. ఈ యుద్ధంలో ఓట్టమన్ సామ్రాజ్యం, జర్మనీ, టర్కీలు ఓడిపోయాక జర్మనీ లో పూర్తిగా నిరాశ జనకమైన పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగ సమస్య, తీవ్రస్థాయి ద్రవ్యోల్బణం( Hyper inflation) ప్రజల జీవితాలను అతలాకుతలం చేసాయి. ఇప్పుడు వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, Hyper-inflation కారణంగా ధరలు అప్పట్లో ఏ స్థాయిలో పెరిగాయంటే, జనాలు వంట చేసుకోవడానికి డబ్బులిచ్చి బొగ్గు కొనుక్కునే కంటే, ఆ కరెన్సీ నోట్లు తగలబెట్టి వంట చేసుకోవడం చవకయినదిగా భావించేవారు. జీవితమంతా కష్టపడి పొదుపు చేసిన సేవింగ్స్ తో ఒక పూట భోజనం కూడా వచ్చేది కాదు. ఈ పరిణామాలు రిటైర్డ్ ఉద్యోగులు, వృద్దుల పాలిట శాపం గా మారాయి. పైగా యుద్దం లో ఓటమి జర్మనీ లో యువతరాన్నికూడా నిస్పృహ లోకి నెట్టేసింది.
హిట్లర్ అగమనం:
ఇలాంటి పరిస్థితుల్లో హిట్లర్ పదునైన ఉపన్యాసాలతో జర్మన్ల మనసు చూరగొన్నాడు. జర్మన్ల ప్రస్తుత దుస్థితి కి యూదులే కారణం అని చెబుతూ జర్మన్ల కు ఒక వర్గ శత్రువుని ఫిక్స్ చేశాడు. జర్మన్లే మానవ జాతి మొత్తం మీద స్వచ్చమైన జాతి (Purest race) అని వారికి రేసిజం తలకెక్కించాడు. జర్మనీ కి పూర్వ వైభవం తీసుకొస్తానని చెబుతూ వారిని ఎస్కేపిస్ట్ డే-డ్రీమింగ్ లోకి నడిపించాడు. నిజానికి ఇది జర్మన్ల ని తమ వైఫల్యాలు, అసలైన సమస్యల నుండి దృష్టి మళ్ళించే ఒక కుయుక్తే. హిట్లర్ కి ముందు జర్మనీ అభివృద్ది కి యూదులు ఎన్నోరకాలుగా తోడ్పడ్డారు. అంతెందుకు జర్మనీ లో పుట్టి నోబెల్ బహుమతి సాధించిన పలువురు ప్రముఖులు – అల్బర్ట్ ఐన్ స్టీన్, హాన్స్బెతె (మొదటి ఆటం బాంబ్ తయారుచేసిన శాస్త్రవేత్త), ఫెయిన్మాన్ వంటి వారందరూ యూదులే. బిజినెస్, ఆర్ట్స్, సైన్స్ తదితర రంగాల్లో జర్మనీ అభివృద్ది కి యూదులు ఎంతో తోడ్పడ్డారు. ఈ యూదులు జర్మనీ లోనూ అప్పట్లో ముందంజ లో ఉన్నారు. అయితే సహజంగానే జర్మనీ తో పాటు ఇతర యూరోపియన్ దేశాల్లో మొదటి నుంచే యూదుల మీద కొంత వ్యతిరేకత ఉంది.
హిట్లర్ కి పలు కారణాలవల్ల యూదుల మీద వ్యక్తిగతం గా కూడా ద్వేషం ఉంది. క్రైస్తవ మతాన్ని స్థాపించిన జీసస్ క్రైస్ట్ కూడా యూదుడి గానే పుట్టారు. క్రైస్తవులకు యూదులకు మధ్య ఉన్న సంబంధాల్లో ఒక dichotomy గోచరిస్తుంది. జీసస్ క్రైస్ట్ ఒక యూదుడి గా పుట్టిన కారణంగా యూదా మతాన్ని అభిమానించే క్రైస్తవులు కొందరైతే, క్రీస్తు ను చంపించింది యూదులు కాబట్టి ఆ కారణం చేత వారిని ద్వేషించే క్రైస్తవులు మరికొందరు. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఈ రెండవ కోవకు చెందిన క్రైస్తవుడు కావడం యూదుల పాలిట శాపం గా మారడమే కాక ప్రపంచ గమనాన్ని మార్చేసింది. హిట్లర్ యూదు వ్యతిరేక వైఖరి వల్ల, యూదు వ్యతిరేకత కలిగిన అనేక వర్గాల నుంచి తనకి రాజకీయ మద్దతు లభించింది.
యూదు వ్యతిరేక వైఖరి: Anti-Semitism
1933 లో హిట్లర్ అధికారం లోకి రాగానే యూదులను సివిల్ సర్వీసెస్ నుండి తొలగించేశాడు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కొన్ని ప్రతిష్టాత్మక కాలేజీల లోకి యూదులకు ప్రవేశం లేకుండా నిషేధించాడు. జర్మన్లు యూదులని పెళ్లి చేసుకోకూడదు అని ఆర్డర్ వేశాడు. వీటన్నింటికీ మించి యూదులు ఎక్కడ పడితే అక్కడ నివసించడానికి వీలు లేదని, Ghetto అని పిలవబడే కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో మాత్రమే మీరు నివసించాలని రూల్ తెచ్చి వీరిని ద్వితీయ శ్రేణి పౌరులుగా ముద్ర వేశారు. (ఈ మధ్య కాలంలో మహా నగరాల్లో ఉండే స్లం ప్రాంతాలని అర్బన్ ఘెట్టో లని పిలవడం పరిపాటిగా మారింది.)
హిట్లర్ అనుసరించిన ఈ యూదు వ్యతిరేక వైఖరి ని anti-Semitism అని పిలుస్తారు. Etymology పరంగా (శబ్ద వ్యుత్పత్తి ) చూస్తే తెలుగు భాష ఎలాగైతే ద్రవిడ భాషా వర్గానికి చెందినదో, హిందీ భాష ఎలాగైతే ఇండో-ఆర్యన్ వర్గానికి చెందిన భాషో, అదే విధంగా యూదులు మాట్లాడే హీబ్రు భాష Semitic గ్రూప్ కి చెందినది. Semitic అన్న పదం హీబ్రూ భాష మాట్లాడే వారి పూర్వీకుడైన షెం (బైబిల్ మరియు యూదా గ్రంథాల లోని నోవహు కుమారుడు ) అనే అతని పేరు నుండి వచ్చింది. మొత్తానికి ఈ కారణంగా యూదు వ్యతిరేక వైఖరికి anti-Semitism అన్న పేరు వచ్చింది.
Holocaust: యూదుల ఊచకోత
ఇదంతా ఒక ఎత్తు అయితే 1941 నుండి 1945 మధ్య లో హిట్లర్ చేసిన యూదుల ఊచకోత మరొక ఎత్తు. గర్భిణీ స్త్రీలను, పిల్లలను, వికలాంగులను, వృద్ధులను సైతం ఇరుకు గదులలో లో కుక్కి విష వాయువు లతో వారిని చంపించేసిన వైనం ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. దాదాపు 60 లక్షల మంది యూదులను ఈ కాలంలో హిట్లర్ చంపించి వేసినట్టు అంచనా. ఈ ఊచ కోతని Holocaust గా సంబోధిస్తారు. క్రిస్టల్నాచ్ట్ – అంటే యూధులకు సంబంధించిన వ్యాపారాలను, ఆస్తులను, ప్రార్థన మందిరాలను ధ్వంసం చేసే కార్యక్రమం గా మొదలై, ఆ తర్వాత సామూహిక హత్యలుగా, చివరికి హోలోకాస్ట్ గా ఈ కార్యక్రమం మారింది. చిన్న కొస మెరుపు ఏమిటంటే, యూదుల ఊచకోత గురించి స్టీవెన్ స్టీల్ బర్గ్ తీసిన హాలీవుడ్ సినిమా షిండ్లర్స్లిస్ట్ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా పలు ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా దర్శకుడు స్టీవెన్ స్టీల్ బర్గ్ కూడా యూదా మతస్తుడే.
ఇవీ మొదటి ప్రపంచ యుద్దానంతరం యూదులు ఎదుర్కొన్న దారుణ పరిస్థితులు. ఇక రెండవ ప్రపంచ యుద్దం, ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు 1948 లో నూతన ఇజ్రాయేల్ దేశం ఏర్పడటం తదుపరి ఆర్టికల్ లో చూద్దాం.
(సశేషం)
– జురాన్ (@CriticZuran)
Also Read చరిత్ర పుటలు: ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం, కారణాలు, సమగ్ర విశ్లేషణ (పార్ట్-1)
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-2) : ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఒక యూదా రాజ్యం
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-3) : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనా ప్రాంతం గా ఎలా మారింది ?
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -4): మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఆధీనంలోనికి ఈ ప్రాంతం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -6) : రెండో ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ ఏర్పాటుకి మార్గం సుగమం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 8): పాలస్తీనా శరణార్థుల సమస్య
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 9): ఆరు రోజుల యుద్ధం , శిబిరాల్లో శరణార్థుల జీవితం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-10): యాసర్ అరాఫత్ అను ఒక విరోధాభాసం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-11): ఓస్లో ఒప్పందాలు, పాలస్తీనా విమోచన, అరాఫత్ ప్రభుత్వం