ప్రస్తుతం ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారిన ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదానికీ మూల కారణాలు అయిన మత పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఎలా యూదా రాజ్యంగా ఉందీ, తర్వాత కాలంలో ఇది అరబ్బుల పాలస్తీనా గా ఎలా మారిందీ, గత ఆర్టికల్స్ లో చర్చించాం. ఈ ప్రాంతానికి సంబంధించి మరొక కీలకమైన మలుపు అయిన మొదటి ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత ఈ ప్రాంతం బ్రిటిష్ ఆధీనంలోనికి ఎలా వచ్చిందీ ఇప్పుడు పరిశీలిద్దాం.
అయితే దీనికి ముందు జియోనిజం ఉద్యమం గురించి తెలుసుకోవాలి.
జియోనిజం ఉద్యమం (Zionism Movement):
ప్రాచీన కాలంలో యూదుల ప్రాంతంగా ఉన్న ఇశ్రాయేలు ప్రాంతం 7 వ శతాబ్దానికల్లా ఇస్లాం పాలకుల చేతికి రావడం, ఆ తర్వాత 16వ శతాబ్దంలో ఓట్టమన్ సామ్రాజ్యంలో కలిసిపోవడం తెలిసిందే. బాబిలోనియన్లు, రోమన్ లు మరియు ఇస్లాం పాలకుల దాడుల కారణంగా 70% యూదులు తమ ప్రాంతం నుండి వేరు వేరు దేశాలకు వలస వెళ్లిపోగా 30% వరకు మాత్రమే ఈ ప్రాంతంలో మిగిలిపోయారు.
19వ శతాబ్దం ప్రారంభానికంతా వేరి వేరు దేశాల్లో ఉన్న యూదుల (Jewish Diaspora) లో ప్రాచీన కాలంలో తమ ప్రాంతంగా ఉన్న ఇజ్రాయిల్ ప్రాంతానికి తిరిగి వెళ్లాలన్న కోరిక బలపడ సాగింది. ఇతర దేశాలలో వీరికి తగిన ప్రాధాన్యత లభించకపోవడం ఒక కారణం అయినప్పటికీ ప్రధాన కారణం మతపరంగా వీరికి అత్యంత పవిత్రమైన జెరుసలేం ఈ ప్రాంతంలో ఉండడమే. యూదులలో ఉన్న ఈ కాంక్ష కి థియోడార్ హెర్జల్ అనే జర్నలిస్టు 1897 లో ప్రచురించిన ఒక కరపత్రం అక్షర రూపాన్ని ఇచ్చింది. ఇదే తర్వాత కాలంలో జియోనిజం (Zionism) ఉద్యమం గా మారింది. తెలుగు అనువాదకులు కొందరు దీనిని సీయోను వాద ఉద్యమం అని కూడా అంటారు కానీ మనం జియోనిజం పదాన్నే ఉపయోగిద్దాం. సీయోను లేదా Zion అనేది జెరూసలేం ప్రాంతంలోని ఒక కొండ పేరు. యూదుల గ్రంథాలలో పలుచోట్ల ప్రస్తావించబడిన ఈ కొండ పేరు తో ప్రారంభమైన ఈ ఉద్యమం 1900 సంవత్సరం తర్వాత యూదుల లో బాగా ప్రాచుర్యం పొందింది. తమ హోమ్ ల్యాండ్ అయినటువంటి ఇజ్రాయిల్ కు వెళ్లాలి అన్న కోరికను వీరిలో మరింత బలపరిచింది.
అయితే ఈ ఉద్యమం పాలస్తీనా వాసులకు సహజంగానే నచ్చలేదు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నాము కాబట్టి ఇది తమ దేశమేనని, ఇప్పుడు కొత్తగా యూదులు ఇక్కడికి వచ్చి ఇక్కడి వనరులు మరియు ఉద్యోగ అవకాశాలను పట్టుకెళ్తే తమ పరిస్థితి దిగజారుతుందని వీరి వాదన. అయితే వీరు పైకి చెబుతున్న కారణాల కంటే బాహాటంగా పైకి చెప్పని మత కారణాలే ఈ వ్యతిరేకత కి ప్రధాన కారణం అన్నది బహిరంగ రహస్యం.
మొదటి ప్రపంచ యుద్ధం ఒక కీలక మలుపు
అయితే మొదటి ప్రపంచ యుద్ధం యూదుల విషయంలో ఒక కీలక మలుపు తీసుకుని వచ్చింది. 16వ శతాబ్దం నాటి నుండి ఈ ప్రాంతం ఓట్టమన్ సామ్రాజ్యం లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ సామ్రాజ్యం, జర్మనీ తో పాటు ( Central Powers) ఒక వైపు ఉంటే, బ్రిటన్, ఫ్రాన్స్ యూఎస్, రష్యా తదితర రాజ్యాలు అవతలి వైపు (Allied Powers)ఉన్నాయి. బ్రిటిష్ వారు యూదులను తమ వైపు తిప్పుకోవడానికి వారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు.
యుద్ధంలో తాము గెలిస్తే యూదులకు ప్రత్యేక రాజ్యాన్ని ఇస్తాం అని హామీ ఇచ్చారు. అఫ్ కోర్స్ , యుద్ధం సమయంలో మద్దతు సాధించడం కోసం భారతదేశానికి కూడా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తాము గెలిస్తే భారత్ కి స్వతంత్ర ప్రతిపత్తి (dominion status) ఇస్తామనే హామీ ఇలాగే ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. యుద్ధం అయిపోయిన తర్వాత భారత దేశానికి ఇచ్చిన హామీ ని తుంగలో తొక్కేసినట్టు, యూదులకు ఇచ్చిన హామీ ని కూడా పక్కన పెట్టేశారు బ్రిటిష్ వారు. ఓట్టమన్ సామ్రాజ్యాన్ని యుద్ధంలో ఓడించిన తర్వాత ఈ ప్రాంతం బ్రిటిష్ పాలన కిందికే వచ్చింది. అయినా కూడా బ్రిటిష్ వారు ప్రత్యేక యూదా దేశం ఏర్పాటు కి పాలస్తీనా వాసులు అభ్యంతరం చెబుతున్నారన్న సాకు తో యూదుల కు ఇస్తానన్న ప్రత్యేక దేశం హామీ ని తుంగ లో ( బహుశా మధ్యదరా సముద్రం లో అనాలేమో) కలిపేసింది.
అందు వల్ల ప్రత్యేక యూదా దేశం ఆకాంక్ష నెరవేరక పోయినా, తమ కాంక్ష ని బ్రిటన్, ఫ్రాన్స్, యూఎస్, రష్యా తదితర దేశాలు అధికారికంగా గుర్తించడానికి ఈ మొదటి ప్రపంచ యుద్దం తోడ్పడింది. పైగా చాలా శతాబ్దాల తర్వాత ఇస్లాం, అరబ్ పాలన నుండి బ్రిటిష్ వారి పాలన కిందకి ఈ ప్రాంతం వచ్చింది.
(సశేషం)
– జురాన్ (@CriticZuran)
Also Read చరిత్ర పుటలు: ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం, కారణాలు, సమగ్ర విశ్లేషణ (పార్ట్-1)
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-2) : ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఒక యూదా రాజ్యం
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-3) : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనా ప్రాంతం గా ఎలా మారింది ?
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -4): మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఆధీనంలోనికి ఈ ప్రాంతం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -5) : మొదటి ప్రపంచ యుద్ధాంతర పరిస్థితులు, హిట్లర్, యూదుల ఊచకోత
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -6) : రెండో ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ ఏర్పాటుకి మార్గం సుగమం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 8): పాలస్తీనా శరణార్థుల సమస్య
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 9): ఆరు రోజుల యుద్ధం , శిబిరాల్లో శరణార్థుల జీవితం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-10): యాసర్ అరాఫత్ అను ఒక విరోధాభాసం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-11): ఓస్లో ఒప్పందాలు, పాలస్తీనా విమోచన, అరాఫత్ ప్రభుత్వం