పాలస్తిన విమోచన సంస్థ పేరు తో అరాఫత్ జోర్డాన్ లో ఉంటూ పాలస్తీనా విమోచన కోసం పోరాడే వాడు. ఆ తర్వాత జోర్డాన్ రాజు తో అరాఫత్ కి సమస్యలు రావడంతో, లెబనాన్ కు షిఫ్ట్ అయ్యాడు. ఆ తర్వాత కాలంలో ఇజ్రాయిల్ లేబనాన్ మీద దాడి చేసి పిఎల్ఓ (పాలస్తిన విమోచన సంస్థ) స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ పరిణామాలతో, యుద్ధం ద్వారా ఇజ్రాయిల్ ని మట్టుపెట్టి పాత పాలస్తీనాను సాధించడం అసాధ్యమని అర్థం చేసుకొ న్నాడు అరాఫత్. దాంతో వ్యూహం మార్చి, మునపటి లా “ఇజ్రయేల్ ని మట్టుపెట్టి 1948 కి ముందు ఉన్న పాలస్తీనా ని సంపూర్ణంగా తిరిగి సాధిస్తాం” అన్న నినాదాన్ని పక్కన పెట్టి, కేవలం 1948 లో ఐక్య రాజ్య సమితి తీర్మానం ప్రకారం పాలస్తీనా ప్రాంతానికి కేటాయించబడి, ఆరు రోజుల యుద్ధం లో ఓడిపోయినప్పుడు ఇజ్రాయిల్ కి సమర్పించుకున్న గాజా మరియు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలను తమకు తిరిగి ఇస్తే చాలు అంటూ అభ్యర్థించాడు.
పాలస్తీన చరిత్ర ని మలుపు తిప్పిన 1993 ఓస్లో ఒప్పందాలు:
దీంతో మళ్లీ శాంతి చర్చలు మొదలయ్యాయి. 1993 లో ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి ఇట్జాక్ రబీన్, అరాఫత్ ల మధ్య అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సమక్షం లో శాంతి ఒప్పందాల పై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల ని అనుసరించి ఇజ్రాయిల్, పాలస్తీనా లు పరస్పరం ఒకరి దేశ ఉనికి ని మరొకరు గౌరవిస్తారు. 1948 ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం పాలస్తీనా కి కేటాయించబడిన వెస్ట్ బ్యాంక్, గాజా ప్రాంతాల అధికారాన్ని క్రమంగా ఇజ్రాయేల్ – “పాలస్తీనా జాతీయ ప్రాధికార సంస్థ (Palestine National Authority or Palestine Authority)” కి అప్పగించి తాను తప్పుకుంటుంది. ఈ ఒప్పందాలు నార్వే రాజధాని ఓస్లో లో మొదలు కావడం వల్ల వీటిని ఓస్లో ఒప్పందాలు అని అంటారు.
ఈ ఓస్లో ఒప్పందం వార్తల తర్వాత శరణార్థి శిబిరాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పాలస్తీనా జెండాలను ఊపుతూ అరాఫత్ మరియు PLO కి మద్దతు తెలుపుతూ వేడుకలు చేసుకున్నారు.. అయితే కొన్ని వర్గాల ప్రజలు మాత్రం గత చరిత్ర కారణంగా ఇజ్రాయేల్ ఈ ఒప్పందాలని నిజంగా అమలు చేస్తుందా అన్న అంశం మీద కొంత అప నమ్మకాన్ని వ్యక్తం చేసారు. ఈ ఒప్పందం ద్వారా ఈ ప్రాంతం లో శాంతికి కృషి చేసినందుకు గానూ, యాసర్ అరాఫత్ కి, ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి ఇట్జాక్ రబిన్ కి సంయుక్తం గా నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ఈ ఒప్పందాలు పాలస్తీనా వాసులకి భారీ ఊరటని కలిగించాయి కానీ, ఇజ్రాయిల్ వాసులకి నచ్చలేదు. ఈ శాంతి చర్చల్లో పాల్గొని ఒప్పందం పై సంతకాలు చేసి, ప్రస్తుతం ఇజ్రాయేల్ కి చెందిన సగం భూభాగాన్ని పాలస్తీనా కి లభించేలా చేసాడనే కారణం తో ఇజ్రాయేల్ ప్రధానికి ఇట్జాక్ రబీన్ ని ఆమీర్ అనే ఒక right wing తీవ్రవాది చంపేసాడు. ఇండియా పాక్ విభజన సమయం లో గాంధీ ని గాడ్సే అనే రైట్ వింగ్ వ్యక్తి చంపినట్టన్న మాట. అటు పాలస్తీనా లో కూడా కొందరు ఫండమెంటలిస్టులకి ఈ ఒప్పందాలు నచ్చలేదు. యూదులందరినీ ఈ ప్రాంతం నుండి తరిమేసి పూర్తి స్థాయి అరబ్ పాలస్తీనా ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్నది అలాంటి వారి ఉద్దేశ్యం. ఇలాంటి వారి ఆకాంక్షలని ప్రతిబింబించిన పాలస్తీనా సంస్థ అప్పటికే (1987 లో) ఏర్పాటు అయి ఉన్న హమాస్.
పాలస్తీనా అథారిటీ సంస్థ ఆధ్వర్యం లో ఎట్టకేలకు అరాఫత్ ప్రభుత్వం:
ఈ ఓస్లో ఒప్పందాల ప్రకారం ఏర్పడ్డ “పాలస్తీనా జాతీయ ప్రాధికార సంస్థ (Palestine National Authority or Palestine Authority)” అనే సంస్థకు, పాలస్తీనా ప్రాంతాల అధికారాన్ని ఇజ్రాయిల్ క్రమంగా అప్పగించింది. తమ మిలిటరీ బలగాలను ఆయా ప్రాంతాల నుండి వెనక్కి రప్పించుకుంది. పాలస్తీనా అథారిటీ సంస్థ ఆధీనం లో కి వెస్ట్ బ్యాంక్ మరియు గాజా ప్రాంతాలు వచ్చాయి. అక్కడ ఎన్నికలు కూడా నిర్వహించారు. ఈ 1994 ఎన్నికల్లో అనేక ఇతర చిన్న చిన్న పార్టీలు పాల్గొన్నాయి కానీ, ఇందాక చెప్పుకున్న హమాస్ సంస్థ ఈ 1994 ఎన్నికలని బహిష్కరించింది. ఎన్నికల్లో అరాఫత్ కి చెందిన ఫతా పార్టీ అత్యధిక సీట్లు సాధించడం తో, పాలస్తీనా అథారిటీ కి అరాఫత్ 1996 లో మొదటి ప్రెసిడెంట్ అయ్యాడు. 2004లో చనిపోయేంతవరకు పాలస్తీనా అథారిటి కి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించాడు.
2004 లో అరాఫత్ చనిపోయిన తర్వాతే ప్రస్తుతం ఇజ్రాయేల్ తో యుద్దం చేస్తున్న హమాస్ పార్టీ బలపడింది. అసలు అరాఫత్ మరణం విషయం లోనూ క్రైం థ్రిల్లర్ ని తలపించే కుట్రకోణాలు చర్చలోకి వచ్చాయి.
(సశేషం)
– జురాన్ (@CriticZuran)
Also Read చరిత్ర పుటలు: ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం, కారణాలు, సమగ్ర విశ్లేషణ (పార్ట్-1)
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-2) : ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఒక యూదా రాజ్యం
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-3) : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనా ప్రాంతం గా ఎలా మారింది ?
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -4): మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఆధీనంలోనికి ఈ ప్రాంతం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -5) : మొదటి ప్రపంచ యుద్ధాంతర పరిస్థితులు, హిట్లర్, యూదుల ఊచకోత
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -6) : రెండో ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ ఏర్పాటుకి మార్గం సుగమం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 8): పాలస్తీనా శరణార్థుల సమస్య
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 9): ఆరు రోజుల యుద్ధం , శిబిరాల్లో శరణార్థుల జీవితం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-10): యాసర్ అరాఫత్ అను ఒక విరోధాభాసం