ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం మళ్ళీ ఈ సమస్య గురించి ప్రపంచం యావత్తు చర్చించేలా చేసింది. అసలు వీరి మధ్య వివాదం ఏంటి, దానికి మూల కారణం ఏంటి అన్నది సమగ్రంగా వివరించే ప్రయత్నం ఈ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్. ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రస్తుత వివాదాన్ని అర్థం చేసుకోవడానికి చరిత్ర పుటల్లోకి చూడవలసిన అవసరం ఉంది. ఈ వివాదాన్ని మూడు భాగాలుగా చూడాల్సి వస్తుంది
• ప్రాచీన కాలం నుండి మొదటి ప్రపంచ యుద్ధం ముందు (1914) వరకు ఉన్న పరిస్థితి
• మొదటి ప్రపంచ యుద్ధం నుండి 1948 ఐక్యరాజ్యసమితి తీర్మానం వరకు ఉన్న పరిస్థితి
• ఐక్యరాజ్యసమితి తీర్మానం అనంతరం తలెత్తిన వివాదాలు
ముందుగా ప్రాచీన కాలం నుండి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాకముందు వరకు వీరిద్దరి మధ్య పరిస్థితి ఎలా ఉండేది అన్నది చూద్దాం.
మతపరమైన కారణాలు
ఏ చారిత్రక వివాదాన్ని అర్థం చేసుకోవాలన్నా, ముందుగా ఆ ప్రాంతానికి సంబంధించిన జాగ్రఫీ ని అర్థం చేసుకోవాలి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే జాగ్రఫీ కంటే ముందు మతపరమైన నేపథ్యం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రాంతం ప్రపంచంలో ని మూడు ముఖ్యమైన మతాలకు అత్యంత ప్రాముఖ్యమైన, పవిత్రమైన ప్రాంతం. యూదా మతం, క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతాలకు ఈ ప్రాంతంలోని జెరూసలేం అత్యంత పవిత్రమైన స్థలం. ఈ కారణంగానే ఇక్కడ జరిగే ప్రతి యుద్దం, ప్రతి వివాదం, మొత్తం ప్రపంచాన్ని దృష్టిసారించేలా చేస్తోంది.
క్రైస్తవ మరియు ఇస్లాం మతాల గురించి మనలో చాలామందికి బాగానే తెలుసు కానీ యూదా మతం గురించి పెద్దగా తెలియదు కాబట్టి క్లుప్తంగా ఈ మతం గురించి చెప్పుకుందాం. ప్రపంచంలో అత్యంత ప్రాచీన మతాలలో వేల సంవత్సరాల క్రితం పుట్టిన యూదా మతం కూడా ఒకటి. ప్రపంచం మొత్తం మీద కలిపి వీరి ప్రస్తుత జనాభా కోటిన్నర మించి ఉండదు. కానీ ప్రపంచ గతిని మార్చేసిన ఎంతోమంది ఈ మతస్తులే. సైన్స్ తో ప్రపంచాన్ని మార్చిన ఐన్ స్టీన్, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కార్ల్ మార్క్స్ లు యూదులే. అంతెందుకు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్, హాలీవుడ్ దర్శకుడు స్పీల్ బర్గ్ వీరందరూ యూదా మతానికి చెందినవారే. 1900 నుంచి ఇప్పటిదా 900 కి పైగా మందికి నోబెల్ ప్రైజ్ వస్తే, ఇందులో 200 కి పైగా నోబెల్ బహుమతులు యూదులకే వచ్చాయి.
క్రైస్తవ మతాన్ని స్థాపించిన జీసస్ క్రైస్ట్ కూడా యూదుడిగానే పుట్టారు. అంటే మన దగ్గర గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు హిందువుగా పుట్టి ఆ తర్వాత బౌద్ధ మతాన్ని స్థాపించినట్లు అన్న మాట. యూదుల మత గ్రంధాల ప్రకారం భవిష్యత్తు లో ఒక మెస్సియా వచ్చి ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతాడు. యూదుడుగా పుట్టిన జీసస్ క్రైస్టే ఆ మెస్సియా అని కొందరు నమ్మితే, అలా నమ్మని యూదులు ఆయనను సిలువ వేసి చంపించారు. అయితే ఆ తర్వాత కాలంలో క్రైస్తవ మతం ప్రబలంగా వ్యాపించింది. క్రైస్తవులకు యూదులకు మధ్య ఉన్న సంబంధాల్లో ఒక dichotomy గోచరిస్తుంది. జీసస్ క్రైస్ట్ ఒక యూదుడి గా పుట్టిన కారణంగా యూదా మతాన్ని అభిమానించే క్రైస్తవులు కొందరైతే, క్రీస్తును చంపించింది యూదులు కాబట్టి ఆ కారణం చేత వారిని ద్వేషించే క్రైస్తవులు మరికొందరు. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఈ రెండవ కోవకు చెందిన క్రైస్తవుడు కావడం యూదుల పాలిట శాపం గా మార డమే కాక ప్రపంచ గమనాన్ని మార్చేసింది.
క్రీస్తుకు సుమారు 500 సంవత్సరాల పూర్వం బౌద్ధమతం పుడితే, క్రీస్తు తర్వాత సుమారు 600 సంవత్సరాలకు ఇస్లాం మతం పుట్టింది. క్రీస్తుశకం ఏడో శతాబ్దంలో ఇస్లాం మతం విస్తృతంగా వ్యాపించింది.
జాగ్రఫీ
ప్రస్తుతం ఇశ్రాయేలు మరియు పాలస్తీనా గా చెప్పబడుతున్న ప్రాంతం మధ్యధరా సముద్రానికి దగ్గరగా ఉండగా, ఈ ప్రాంతం చుట్టూ సిరియా, జోర్డాన్, లేబనాన్, మరియు సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలు ఉన్నాయి. ఇది కూడా ఈ సమస్య మరింత జటిలం కావడానికి కారణమైంది. భారత్ పాకిస్తాన్ లాంటి దేశాలు కాశ్మీర్ ప్రాంతం మాదంటే మాదంటూ గొడవ పడుతున్నాయి. అయితే ఇజ్రాయిల్ పాలస్తీనాలు మాత్రం పూర్తి దేశం మాదంటే మాదంటూ గొడవ పడుతున్నాయి. ఈ గొడవకి కారణాలు అర్థం కావాలంటే ప్రాచీన కాలం నుండి ఈ ప్రాంతం ఎవరి ఆధీనం నుండి ఎవరి ఆధీనానికి మారుతూ వచ్చింది అన్న చరిత్ర అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాతి ఆర్టికల్ లో అసలు ఈ ప్రాంతం ప్రాచీన కాలం లో యూదా రాజ్యం గా ఎలా అవతరించింది, ఆ తర్వాత కాలం లో అది ముస్లిముల పాలస్తీనా గా ఎలా మారింది అన్నది చూద్దాం.
(సశేషం)
– జురాన్ (@CriticZuran)
Also Read చరిత్ర పుటలు: ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం, కారణాలు, సమగ్ర విశ్లేషణ (పార్ట్-1)
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-2) : ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఒక యూదా రాజ్యం
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-3) : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనా ప్రాంతం గా ఎలా మారింది ?
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -4): మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఆధీనంలోనికి ఈ ప్రాంతం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -5) : మొదటి ప్రపంచ యుద్ధాంతర పరిస్థితులు, హిట్లర్, యూదుల ఊచకోత
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -6) : రెండో ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ ఏర్పాటుకి మార్గం సుగమం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 8): పాలస్తీనా శరణార్థుల సమస్య
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 9): ఆరు రోజుల యుద్ధం , శిబిరాల్లో శరణార్థుల జీవితం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-10): యాసర్ అరాఫత్ అను ఒక విరోధాభాసం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-11): ఓస్లో ఒప్పందాలు, పాలస్తీనా విమోచన, అరాఫత్ ప్రభుత్వం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-12): అరాఫత్ మరణం, క్రైం థ్రిల్లర్ ని తలపించే కుట్ర కోణం