గత ఆర్టికల్ లో ఇజ్రాయేల్-పాలస్తీనా ప్రాంత మత పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు అర్థం చేసుకున్నాం. ఇక ఇప్పుడు కొంచెం ప్రాచీన చరిత్ర ని తెలుసుకుందాం. అసలు ఈ ప్రాంతం యూదా రాజ్యంగా ఎలా మారిందో తెలుసుకుందాం. దీనికి యూదా మత గ్రంథాల సమాచారం పై కూడా కొంచెం ఆధారపడాల్సి వస్తుంది.
అబ్రహాము : యూదుల చరిత్ర కి ఆద్యుడు
యూదా మత గ్రంధాల ప్రకారం దేవుడు అబ్రహాము అనే వ్యక్తితో మాట్లాడతాడు. భవిష్యత్తులో ఈయనకు కలగబోయే సంతానం, వారి తదుపరి తరాలు ప్రపంచం మొత్తం వ్యాపిస్తారని చెబుతాడు. అలాగే అబ్రహాము ని ప్రస్తుతం తను ఉన్న హారాను ప్రాంతం నుండి కానాను ప్రాంతానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. హారాను ప్రాంతం సుమారు ఇప్పటి టర్కీకి సరిపోలితే, ఆయన వెళ్ళవలసిన కానాను ప్రాంతం ప్రస్తుత ఇజ్రాయిల్ జోర్డాన్ తదితర ప్రాంతాలకు సరిపోలుతుంది. ఆ విధంగా అబ్రహాము తర్వాత తరాల వారు ఈ కానాను ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత వారు అనేక తెగలుగా విడిపోయారు. ఇజ్రాయిల్ అన్న పదం అబ్రహాము మనవడైన యాకోబు కి ఉన్న మరొక పేరు. దీనికి “దేవుని చూసిన వాడు”అని అర్థం .
ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాచీన చరిత్ర లో ముగ్గురు రాజులు కనిపిస్తారు. వారే సౌలు, డేవిడ్ మరియు సోలమన్.
సౌలు: యూదుల ప్రాచీన చరిత్ర లో మొదటి బలమైన రాజు ( క్రీస్తుపూర్వం 1000 సం )
యూదుల కి సంబంధించిన ప్రాచీన చరిత్ర లో మొదటి రాజు సౌలు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల సమయం లో ఈయన అనేక తెగలుగా విడిపోయిన ఇశ్రాయేలీలను ఏకం చేసి రాజ్యాన్ని స్థాపించాడు. మన దగ్గర చిన్న చిన్న తెగలు అన్నింటిని ఏకం చేసి సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడి తో ఈయనను పోల్చవచ్చు. అయితే సౌలు చంద్రగుప్త మౌర్యుడి కంటే సుమారు 700 సంవత్సరాలు ముందటి వాడు. చంద్రగుప్తుడి రాజ్యాన్ని తన మనవడైన అశోకుడు విస్తృత సామ్రాజ్యం గా మార్చినట్లు , సౌలు స్థాపించిన రాజ్యాన్ని తర్వాత కాలంలో డేవిడ్ మరియు సోలమన్ రాజులు మరింత బలోపేతం చేశారు.
డేవిడ్ & సోలమన్ :
డేవిడ్ రాజు చిన్న పిల్లవాడిగా ఉన్నపుడే గొలియాత్ అనే శత్రు దేశపు యోధున్ని సంహరించిన కథ కొంత మందికి తెలిసే ఉండ వచ్చు. డేవిడ్ రాజు అయిన తర్వాతే జెరుసలేం ఈ ప్రాంతానికి రాజధాని గా మారింది. డేవిడ్ తర్వాత తన కుమారుడు సోలమన్ రాజయ్యాడు. ఇతను చాలా తెలివైన వాడని, ఙ్ఞాని అని అంటారు. సోలమన్ రాజు క్రీస్తు పూర్వం 957 సంవత్సరంలో జెరూసలేం లో యూదుల కోసం నిర్మించిన మొదటి టెంపుల్ యూదులకు అత్యంత పవిత్రమైనది. అయితే ఓ 400 సంవత్సరాల తర్వాత వీరిపై దాడి చేసిన బాబిలోనియన్ లు సోలమన్ కట్టించిన ఆ టెంపుల్ ని ధ్వంసం చేశారు
ఒక బలమైన రాజు తదనంతరం పెద్ద రాజ్యం రెండు గా చీలిపోవడమో లేదా చిన్న చిన్న రాజ్యాలుగా విచ్చినం కావడమో భారతదేశ చరిత్రలో సైతం అనేక సామ్రాజ్యాల విషయంలో జరిగింది. సోలమన్ తర్వాత ఈ రాజ్యానికి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకి ఒకటి గా, బలంగా ఉన్న ఇశ్రాయేలు రాజ్యం, సొలోమన్ అనంతరం సమరియ రాజ్యం ( ఉత్తర భాగం) మరియు యూదా రాజ్యం గా (దక్షిణ భాగం )విడిపోయింది. అయితే ఆ తర్వాత కాలంలో ఈ రెండు రాజ్యాలు కూడా ఇతర రాజ్యాల దాడిలో అధికారాన్ని కోల్పోయాయి. క్రీస్తు పూర్వం 722లో సమరయ రాజ్యం కూలిపోగా, క్రీస్తుపూర్వం 586లో బాబిలోనియన్ లు యూదా రాజ్యాన్ని వశం చేసుకోవడమే కాకుండా, సోలమన్ కాలం లో నిర్మించబడిన జెరూసలేం టెంపుల్ ని ధ్వంసం చేశారు.
ఈ బాబిలోనియన్ల దాడి తర్వాత చాలా మంది యూదులు ఈ ప్రాంతాని వదిలి వేర్వేరు ప్రాంతాలకి పారిపోయారు. యూదులు తమ ప్రాంతాన్ని వదిలి చెల్లాచెదురైపోవడం ఇక్కడి నుండే మొదలయింది. తర్వాతి ఆర్టికల్ లో, ఈ యూదుల రాజ్యం అరబ్బుల పాలస్తీనా గా ఎలా మారింది అన్నది చూద్దాం.
(సశేషం)
– జురాన్ (@CriticZuran)
Also Read చరిత్ర పుటలు: ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం, కారణాలు, సమగ్ర విశ్లేషణ (పార్ట్-1)
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-2) : ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఒక యూదా రాజ్యం
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-3) : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనా ప్రాంతం గా ఎలా మారింది ?
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -4): మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఆధీనంలోనికి ఈ ప్రాంతం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -5) : మొదటి ప్రపంచ యుద్ధాంతర పరిస్థితులు, హిట్లర్, యూదుల ఊచకోత
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -6) : రెండో ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ ఏర్పాటుకి మార్గం సుగమం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 8): పాలస్తీనా శరణార్థుల సమస్య
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 9): ఆరు రోజుల యుద్ధం , శిబిరాల్లో శరణార్థుల జీవితం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-10): యాసర్ అరాఫత్ అను ఒక విరోధాభాసం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-11): ఓస్లో ఒప్పందాలు, పాలస్తీనా విమోచన, అరాఫత్ ప్రభుత్వం