ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -13): హమాస్ 1987-2004 తొలి శకం, వీల్ చైర్ లో నుంచే కథ నడిపిన సూత్రధారి

ప్రస్తుతం ఇజ్రాయిల్ పాలస్తీనా ల మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ని యావత్ ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. యూఎస్, యూకే ఫ్రాన్స్ లాంటి బలమైన దేశాల మద్దతు కలిగిన ఇజ్రాయిల్ ని హమాస్ అనే ఒక. సంస్థ గడగడలాడిస్తోంది. కేవలం 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన గాజా నుంచి నడపబడుతున్న ఈ సంస్థ, భారత సహా అనేక దేశాలకు యుద్ధ పరికరాలను ఎగుమతి చేసే ఇజ్రాయిల్ కి కొరకరాని కొయ్యగా మారింది అంటే ఈ సంస్థని స్థాపించింది ఏ మిలటరీ యోధుడో లేక గెరిల్లా వీరుడో అయి ఉండవచ్చని చాలామంది ఊహిస్తారు. కానీ దీన్ని స్థాపించింది ఒక చిన్న మత గురువు అని, అది కూడా 12 ఏళ్ల వయస్సుకే Quadriplegic (అంగ చతుష్ఠయ పక్షవాతం) బారిన పడి జీవితం మొత్తం వీల్ చైర్ కే పరిమితమైన ఒక శరణార్థి అని చెబితే చాలా మందికి దిమ్మ తిరిగి పోతుంది. అతనే యాసిన్ అహ్మద్.

ఊపిరి అనే సినిమాలో నాగార్జున ఒక ప్రమాదం కారణంగా వెన్నెముకకు తగిలిన గాయం వల్ల Quadriplegic అవుతాడు. దీనివల్ల రెండు చేతులు మరియు రెండు కాళ్లు కదల లేని స్థితిలోకి వెళ్లిపోవడం వల్ల ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో క్వాడ్రిప్లెజిక్ ( Quadri అంటే 4, quadrilateral అంటే చతుర్భుజం) అంటారు. యాసిన్ అహ్మద్ కూడా 12 ఏళ్ల వయసులో ఇదే పరిస్థితి బారిన పడ్డాడు. అప్పటి నుండి వీల్ చైర్ కే పరిమితం అయ్యాడు. 50 సంవత్సరాల వయసు లో ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న, ఈ శతాబ్దం లోనే అత్యంత ప్రమాదకారి అయిన సంస్థ హమాస్ ని స్థాపించాడు.

అసలు ఎవరు ఈ యాసిన్ అహ్మద్?

పాలస్తీనా ను బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న సమయంలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టాడు యాసిన్ అహ్మద్. 1948 లో ఇజ్రాయిల్ నూతన దేశం ఏర్పాటు అయిన తర్వాత, మొదటి అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం సమయంలో, పలు గ్రామాల లోని యూదేతరులు వాళ్ల గ్రామాలను ఖాళీ చేసి, శరణార్థులుగా వెళ్లి పోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడున్నర లక్షల మంది ఈ సమయంలో శరణార్థులుగా మారారని గతంలో తెలుసుకున్నాం. ఆ ఏడున్నర లక్షల మంది శరణార్థులలో ఒకడు ఈ యాసిన్ అహ్మద్.

1948 సమయంలో వీరి కుటుంబం మొత్తం శరణార్థులు గా గాజా ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న సమయంలో ఒక చిన్న ప్రమాదంలో వెన్నెముక కు జరిగిన గాయం కారణంగా రెండు చేతులు రెండు కాళ్ళు పడిపోయి వీల్ చైర్ కి పరిమితం అయిపోయాడు. చదువు కూడా మధ్యంతరంగా ఆపి వేయాల్సి వచ్చింది. అయితే వీల్ చైర్ లో కూర్చునే కుటుంబ సభ్యుల సహాయంతో పుస్తకాలను విపరీతంగా చదవడం మొదలుపెట్టాడు. మతపరమైన, ఫిలాసఫీ కి సంబంధించిన పుస్తకాలతో పాటు, ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను విపరీతంగా చదవడం మొదలుపెట్టాడు. కొద్ది సంవత్సరాల తర్వాత స్థానిక మసీదుల లో ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాడు. సంవత్సరాల పాటు విపరీతంగా పుస్తకాలు చదివిన జ్ఞానం ఆ ప్రసంగాల లో ప్రతిఫలిస్తూ ఉండడం తో ఈయన ప్రసంగాల కు స్థానిక ముస్లిం లు అనేకమంది ఆకర్షితులయ్యారు. తర్వాత కాలంలో స్థానిక పాఠశాలలో టీచర్ గా కూడా పనిచేశాడు. చిన్న స్కూల్ టీచర్ గా, స్థానిక మసీదులో ఇమామ్ గా చేసిన ఇతను, వీల్ చైర్ కే పరిమితమైపోయి, నడవ లేని, చేతులు కదపలేని స్థితి లో ఉంటూ, సన్నని గొంతుతో ఉపన్యాసాలు ఇచ్చే ఇతను, ఇవాళ ప్రపంచ చరిత్ర లోనే తీవ్రవాదానికి సంబంధించి ఒక కేస్ స్టడీ గా మారిన హమాస్ లాంటి సంస్థను స్థాపించడం అన్నది బహుశా చాలా మందికి నమ్మశక్యం కాకపోవచ్చు.

హమాస్ ఎలా మొదలైంది

1987 లో మొదలైన హమాస్ గురించి తెలుసుకునే ముందు ముస్లిం బ్రదర్ హుడ్ అనే సంస్థ గురించి తెలుసుకోవాలి. 1920 ల లో ఈజిప్టులో ఒక స్కూల్ టీచర్ ముస్లింల సంక్షేమం కోసం స్థాపించిన ఈ ముస్లిం బ్రదర్ హుడ్ అనే సంస్థ తర్వాతి కాలం లో బ్రిటిష్ పాలన కు వ్యతిరేకం గా పోరాడింది. ఆ తర్వాత రాజకీయ పార్టీ గా అవతరించింది. ఈజిప్ట్ తో పాటు ముస్లిం లు ప్రబలంగా ఉన్న అనేక దేశాలకు విస్తరించింది. పాలస్తీనా లో ఈ సంస్థ యొక్క శాఖను 1973 లో ప్రారంభించాడు యాసిన్ అహ్మద్.

ఆ సంస్థ ద్వారా మొదట్లో పలు చారిటీ కార్యక్రమాలు నిర్వహించాడు. 1968 లో జరిగిన మూడవ అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం తర్వాత ఇజ్రాయిల్ ఆధీనంలోకి వెళ్లిపోయిన గాజా ప్రాంతంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్న పాలస్తీనా శరణార్థులకు ఈ సంస్థ ద్వారా సేవలందించి పాలస్తీనా వాసుల లో గొప్ప పేరు ను సంపాదించుకున్నాడు. ముస్లిం బ్రదర్ హుడ్ అన్న సంస్థ అప్పటికే పలు ముస్లిం దేశాలలో విస్తరించి ఉండటం కారణంగా నిధుల కొరత పెద్దగా ఉండేది కాదు. దీంతో పాలస్తీనా లోని ఈ సంస్థ యొక్క శాఖ ద్వారా పాలస్తీనా శరణార్థులకు అవసరమైన వైద్య సహాయం, విద్యా వసతులతో పాటు అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా ఈ సంస్థ ద్వారా చేసేవారు.

ఇలా ఈ సంస్థ ద్వారా మంచి పేరును సంపాదించిన తర్వాత, మారిన రాజకీయ పరిస్థితులలో ఇదే సంస్థను 1987 లో హమాస్ (హరాకత్ అల్ ముఖవామా అల్ ఇస్లామియా అన్న పదానికి సంక్షిప్త రూపం) గా మార్చారు. ఈ పదానికి ఇస్లామిక్ ప్రతిఘటన ఉద్యమం అని అర్థం. ముస్లిం బ్రదర్ హుడ్ యొక్క పాలస్తీనా శాఖ గా ఉన్నంత కాలం ఆ సంస్థ ప్రధాన లక్ష్యం ఈ ప్రాంతంలో ఉన్న ముస్లింల, ప్రత్యేకించి పాలస్తీనా శరణార్థులుగా ఉన్న ముస్లిం ల యొక్క సంక్షేమం. కానీ హమాస్ గా మారిన తర్వాత సంస్థ ప్రధాన ఆశయం మారిపోయింది. ఇజ్రాయిల్ ఆక్రమణలో ఉన్న పాలస్తీనా ప్రాంతాన్ని తిరిగి సాధించడం ప్రతి ఒక్క ముస్లిం బాధ్యత అని ప్రకటించిన యాసిన్ అహ్మద్, పాలస్తీనా ప్రాంతం అంటే కేవలం వెస్ట్ బ్యాంక్ మరియు గాజా మాత్రమే కాదని, జోర్డాన్ నది నుండి మధ్యధరా సముద్రం మధ్యలో ఉన్న పూర్తి పాలస్తీనా ప్రాంతం అని, దాన్ని ఇజ్రాయిల్ నుండి తిరిగి సాధించడమే హమాస్ లక్ష్యం అని ఉద్ఘాటించారు.

దశాబ్ద కాలం ఇజ్రాయిల్ జైలు జీవితం, వీల్ చైర్ కే పరిమితం, జైల్లోనే వ్యూహాల మధనం

1987 లో హమాస్ సంస్థను స్థాపించిన యాసిన్ అహ్మద్ నిజానికి అంతకు మూడేళ్ల ముందు నుండే ఆయుధాలను సమకూర్చుకోవడం మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన సమాచారం రావడంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం 1984 లోనే యాసిన్ ను అరెస్టు చేసింది. 1985 లో అరబ్ దేశాలతో జరిగిన ఒప్పందాల కారణంగా తనను విడుదల చేసింది. జైలు విడుదలైన తర్వాత 1987 లో హమాస్ సంస్థను స్థాపించిన యాసిన్, కొత్త వ్యూహానికి తెర లేపాడు. అదే ఆత్మహతి దళాల బాంబు దాడులు. మోటివేటింగ్ స్పీచ్ లు ఇచ్చి, ఆత్మహుతికి సిద్ధమయ్యేలా యువతను ప్రేరేపించి వారి ద్వారా ఆత్మహతి బాంబు దాడులు చేయించడం మొదలుపెట్టాడు. వేకువ జాము సమయాల్లో ఇశ్రాయేలీయులను లక్ష్యంగా చేసుకొని బస్సులు, ఇతర పబ్లిక్ స్థలాల లో ఈ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మహతి బాంబు దాడులు తర్వాతి సంవత్సరాల లో ఇజ్రాయిల్ వాసులకు ముచ్చెమటలు పట్టించాయి.

దీంతో సంస్థ ను స్థాపించిన రెండు సంవత్సరాలకే, అంటే 1989 లో, ఇజ్రాయిల్ ప్రభుత్వం యాసిన్ ను మళ్లీ జైలులో పెట్టింది. 1997 వరకు దాదాపు 8 సంవత్సరాలు జైలులో ఉంటూనే సంస్థ ను నడిపించాడు యాసిన్. అయితే 1973 నుండి ఆయన చేస్తున్న చారిటీ కార్యక్రమాల వల్ల, ఆయన ఉపన్యాసాల వల్ల, ముస్లిం దేశాలలో ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పాలస్తీనా వాసులతో పాటు ఇతర ముస్లిం దేశాలు కూడా యాసిన్ ని విడుదల చేయాల్సిందిగా ఇజ్రాయిల్ పై ఒత్తిడి తీసుకురాసాగారు. అయితే వీరి ఒత్తిడిని మొదట్లో పట్టించుకోని ఇజ్రాయిల్ ప్రభుత్వం, తర్వాతి కాలం లో జోర్డాన్ లో బందీగా ఉన్న ఇద్దరు ఇజ్రాయిల్ కి చెందిన మొసాద్ ఏజెంట్ లని విడిపించుకోవడం కోసం యాసిన్ ని 1997లో విడుదల చేసింది. విడుదల చేసేటప్పుడు ఇజ్రాయిల్ విధించిన షరతు కేవలం ఒకటే – యాసీన్ మళ్లీ ఆత్మహత్య బాంబు దాడులు చేయించకూడదు అని.

అరాఫత్ vs యాసీన్: అభిమానం, గౌరవం, వైరం:

జైలు లోంచి 1997 లో విడుదలైనప్పుడు ఒక హీరోకి, ఒక యుద్ధ వీరుడికి స్వాగతం పలికినట్లుగా వేలాది పాలస్తీనా వాసులు తనకు స్వాగతం పలికారు. అప్పటికే యాసిర్ అరాఫత్ 1993 ఓస్లో ఒప్పందాల తర్వాత జరిగిన ఎన్నికలలో పాలస్తీనా అథారిటీకి ప్రెసిడెంట్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. యాసీన్ కి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రెసిడెంట్ అరాఫత్, యాసిన్ కలిసి పాల్గొన్నారు. యాసిన్ విడుదలను ఎంతగానో స్వాగతించాడు అరాఫత్. ఇజ్రాయిల్ పట్ల అరాఫత్ అనుసరిస్తున్న మెతక వైఖరి నచ్చకపోయినప్పటికీ, ఇజ్రాయిల్ ఇద్దరికీ ఉమ్మడి శత్రువు అయిన కారణంగా యాసీన్ కూడా అరాఫత్ తో స్నేహాన్ని కోరుకున్నాడు.

కానీ, “ఇజ్రాయేల్ ఉనికికి గుర్తిసాం, మాకు వెస్ట్ బ్యాంక్, గాజా ల తో కూడిన పాలస్తీనా ఇస్తే చాలు” అంటూ యాసర్ అరాఫత్ తీసుకున్న మిత వాద వైఖరి తో మాత్రం జీవితాంతం విభేదించాడు యాసిన్. పైగా అరాఫత్ అరబ్ దేశాల సహాయం తో పాలస్తీనా ని సాధించాలనే “సెక్యులర్ అరబ్ జాతీయవాదం” వైఖరి కి మొగ్గు చూపితే, యాసిన్ అహ్మద్ సంస్థ హమాస్ “ఇస్లామిక్ పాలస్తీనా” కోసం పోరాడింది. తర్వాతి కాలం లో హమాస్ సంస్థ చేసిన దాడులు, విధ్వంసాలు ఇటు అరాఫత్ కి కూడా ఇబ్బందికరం గా మారాయి. ఇజ్రాయేల్-పాలస్తీనా శాంతి చర్చలు కొనసాగాలి అంటే, ముందు యాసిన్ ని కట్టడి చేయాలి అంటూ ఇజ్రాయేల్, దాని మద్దతు దేశాల నుండి అరాఫత్ పై ఒత్తిడి పెరిగింది. ఈ వైరాలు ఆ తర్వాతి కాలం లో అరాఫత్ ఫతా పార్టీ, యాసిన్ హమాస్ పార్టీ ల మధ విభేధాల కి కూడా దారి తీసాయి.

జైలు నుంచి విడుదలైన తరువాత యాసిన్ -పాలస్తీనా బిన్ లాడెన్:

1997 లో జైలు నుంచి విడుదలైన తరువాత తన విశ్వరూపం చూపించాడు యాసిన్. విడుదల సమయంలో ఇజ్రాయిల్ విధించిన ఏకైక షరతు ని ఉల్లంఘించి మళ్లీ ఆత్మహతి బాంబు దాడులకు పిలుపునిచ్చాడు. దీంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం తనను హౌస్ అరెస్టు చేసింది. నిజానికి జైలు నుంచి విడుదల చేసిన కొత్త లో ఇజ్రాయిల్ ప్రభుత్వం తో పాటు పాశ్చాత్య మీడియా కూడా యాసిన్ ని తక్కువ అంచనా వేసింది. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున, తన పక్షవాతం ముదరడమే కాకుండా, చూపు మందగించడం తో పాటు ఊపిరితిత్తులకి సంబంధించిన మరిన్ని ఆరోగ్య సమస్య లు వచ్చినందున యాసిన్ నెమ్మదిస్తాడని వారు భావించారు.

కానీ Quadriplegic అయి, వీల్ చైర్ కే పరిమితమై ఉండీ కూడా, పెళ్లి చేసుకుని 11 మంది పిల్లలను కన్న యాసీన్ , ఆరోగ్య పరిస్థితి కానీ, జైలు జీవితం, కానీ తన పట్టుదల ముందు దిగదుడుపే అని నిరూపించేలా పలు విధ్వంసాలకు సూత్రధారిగా వ్యవహరించాడు. అప్పట్లో జెరుసలేం నడిబొడ్డున జరిగిన బస్సు దాడి ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరచింది. ఒకానొక సమయంలో “పాలస్తీనా బిన్ లాడెన్” గా ఇజ్రాయిల్ అధికారుల చే పిలవబడ్డాడు యాసిన్.

వీల్ చైర్ లోని యాసిన్ ను మిసైల్స్ తో చంపిన ఇజ్రాయిల్:

అయితే యాసిన్ కార్యక్రమాలకు పూర్తి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో, 2004 లో పకడ్బందీ గా వ్యూహం వేసి – ఇంటికి దగ్గరలో ఉన్న మసీదు కు తన అసిస్టెంట్ల సహాయంతో వీల్ చైర్ లో వెళ్తున్న యాసిన్ మీద ఇజ్రాయిల్ మిస్సైల్ దాడి చేసింది. యాసిన్ తో పాటు పలువురు సహాయకులు, కుటుంబ సభ్యులు కూడా ఈ దాడి లో చనిపోయారు. అరబ్, ముస్లిం దేశాల తో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ దాడిని ఖండించాయి.

1987 లో హమాస్ ని స్థాపించి, అనేక ఒడిదుడుకుల మధ్య సంస్థ ని నిలబెట్టి, 2004 వరకు దాన్ని నడిపించి, ఇజ్రాయిల్ వాసుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన, ఒక “అంగ చతుష్టయ పక్షవాత” రోగి, జీవితమంతా వీల్ చైర్ పైన ఉంటూనే తన ఆలోచనల తో, వ్యూహాల తో, ఉపన్యాసాల తో ఒక దేశం తో యుద్ధం చేసిన ఒక చిన్న మత గురువు అధ్యాయం ఆ విధంగా ముగిసి పోయింది. దీంతో హమాస్ పీడ విరగడయింది అనుకున్న ఇజ్రాయిల్ కు, 2005 తర్వాత నుండి ఉవ్వెత్తున ఎగసిన హమాస్ 2.0 వెర్షన్, 1987-2004 మధ్య యాసిన్ అహ్మద్ సమయం లో జరిగిన విధ్వంసానికి 10X విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించింది. 1968 లో ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, లెబనాన్, సౌదీ, యెమెన్ లాంటి 6 దేశాలు కలిసి దాడి చేస్తే, 6 రోజుల్లో ఈ 6 దేశాలని మడతబెట్టి యుద్దాన్ని ముగించిన ఇజ్రాయేల్ ని, ఇప్పుడు 2023 లో చిన్న గాజా ప్రాంతం నుండి యుద్దం చేస్తూ నిలవరిస్తోంది.

– జురాన్ (@CriticZuran)

Also Read చరిత్ర పుటలు: ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం, కారణాలు, సమగ్ర విశ్లేషణ (పార్ట్-1)

Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-2) : ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఒక యూదా రాజ్యం

Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-3) : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనా ప్రాంతం గా ఎలా మారింది ?

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -4): మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఆధీనంలోనికి ఈ ప్రాంతం

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -5) : మొదటి ప్రపంచ యుద్ధాంతర పరిస్థితులు, హిట్లర్, యూదుల ఊచకోత

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -6) : రెండో ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ ఏర్పాటుకి మార్గం సుగమం

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -7) : 1948 ఐక్యరాజ్యసమితి తీర్మానం, ఇజ్రాయిల్ ప్రత్యేక దేశం ఏర్పాటు

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 8): పాలస్తీనా శరణార్థుల సమస్య

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 9): ఆరు రోజుల యుద్ధం , శిబిరాల్లో శరణార్థుల జీవితం

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-10): యాసర్ అరాఫత్ అను ఒక విరోధాభాసం

Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-11): ఓస్లో ఒప్పందాలు, పాలస్తీనా విమోచన, అరాఫత్ ప్రభుత్వం

Also Read : ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-12): అరాఫత్ మరణం, క్రైం థ్రిల్లర్ ని తలపించే కుట్ర కోణం

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close