Zionism ఉద్యమ సమయం (1897) నుండి తమకంటూ ఒక Home Land ఉండాలని పరితపించిన యూదుల స్వప్నం సాకారం చేసింది 1948 ఐక్యరాజ్య సమితి తీర్మానం. 1948 నాటికి పాలస్తీనా గా ఉన్న ఈ ప్రాంతాన్ని రెండు దేశాలుగా విభజించింది ఈ తీర్మానం. యూదులకి వంద సంవత్సరాల కల అయిన Promised Land ని, పాలస్తీనా వాసులకి వంద సంవత్సరాలకి సరిపడేలా “శరణార్థుల సమస్య” ని ఏక కాలం లో సృష్టించింది ఈ తీర్మానం.
తీర్మానం 181 నేపథ్యం:
గత ఆర్టికల్స్ ద్వారా ఇప్పటి దాకా పరిశీలించిన Chronological సమాచారాన్ని క్రోడీకరిద్దాం. క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 586 వరకు ఈ ప్రాంతం యూదుల రాజ్యంగా ఉండేది. 586 BC లో ఈ ప్రాంతం బాబిలోనియన్ల ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి యూదులు ఈ ప్రాంతం నుండి చెల్లాచెదరైపోవడం మొదలైంది. తరువాత 20 BC సమయంలో ఇది మళ్ళీ యూదు పాలకుల చేతిలోకి వచ్చింది. ఈ ప్రాంతం యూదుల పాలన లో ఉన్న సమయం లోనే ఇక్కడ జీసస్ క్రైస్ట్ జన్మించాడు. కానీ 70 ADలో, అది రోమన్ పాలకుల చేతిలోకి వెళ్లిపోయింది. మళ్లీ 7వ శతాబ్దంలో, ఖలీఫాలు అని పిలువబడే ఇస్లాం పాలకుల అధికారం క్రిందకు వచ్చింది. ఆ తర్వాత అనేక ఇతర పాలకులచే పరిపాలించబడి, చివరకు 1517 AD లో ఒట్టోమన్ సామ్రాజ్యం గొడుగు కిందకి వచ్చింది. దాదాపు 400 సంవత్సరాలు, అంటే 1917 వరకు ఇది ఒట్టోమన్ పాలకుల పాలన లో ఉంది. 1918లో, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, ఇది బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత, ఈ ప్రాంతాన్ని రెండు వేర్వేరు దేశాలుగా విభజించాలని సలహా ఇస్తూ ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఐక్యరాజ్యసమితి నవంబర్ 29, 1947న చేసిన “తీర్మానం 181” నూతన ఇజ్రాయేల్ దేశ ఏర్పాటు కి బాటలు వేసింది.
75 సంవత్సరాల తర్వాత కూడా యుద్దాలు కొనసాగేంతగా చరిత్రని మలుపు తిప్పిన ఈ తీర్మానం లో ఇంతకీ ఏముంది ?
ఈ తీర్మానం లోని అంశాలు –
1. పాలస్తీనా ప్రాంతాన్ని యూదుల ఇజ్రాయేల్ మరియు అరబ్బుల పాలస్తీనా దేశాలు గా విభజించాలి..
2. పాలస్తీనాలో యూదుల రాజ్యానికి దాదాపు 56% భూభాగం, అరబ్ రాజ్యానికి దాదాపు 43% భూభాగం కేటాయించాలి.
3. ఇరు వర్గాలకి ముఖ్య ప్రాంతం అయిన జెరూసలేం (1%) అంతర్జాతీయ అడ్మినిస్ట్రేషన్ కిందకు వస్తుందని ఈ తీర్మానం నిర్ణయించింది. జెరుసలేం ప్రాంతం లో యూదుల సెకండ్ టెంపుల్ కి చెందిన శిథిలావస్థ లో ఉన్న పవిత్ర గోడ, ముస్లిముల కి మక్కా మదీనా తర్వాత మూడో పవిత్రమైన మసీద్ అల్ అక్సా మసీద్ తో పాటు క్రైస్తవులకి చెందిన అనేక పవిత్ర ప్రాంతాలు ఉన్న సంగతి తెలిసిందే.
Read Between the “Lines” (of Demarcation): తీర్మానం లోని అంశాలపై విశ్లేషణ:
1. యూదులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఇజ్రాయేల్ దేశంగా, అరబ్బులు ఎక్కువ గా ఉండే ప్రాంతాలు పాలస్తీనా దేశంగా విభజించాలని తీర్మానం చెప్పింది. కానీ ఈ తీర్మానానికి కొద్ది సంవత్సరాల ముందే లక్షాలది మంది యూదులు వేర్వేరు దేశాల నుండి ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే.
2. యూదుల రాజ్యానికి దాదాపు 56%, అరబ్ రాజ్యానికి దాదాపు 43% కేటాయించాలని తీర్మానం చెప్పింది. అయితే ఈ తీర్మానం వచ్చే సమయానికి ఈ ప్రాంతం లోని యూదుల సంఖ్య సుమారు 6 లక్షలయితే (33%) అరబ్బుల సంఖ్య 13 లక్షలు (66%). మిగిలిన 1% లో క్రైస్తవులు, కొన్ని ఇతర తెగల వారు ఉన్నారు. 33% జనాభా కలిగిన యూదులకి 56% భూభాగం ఇవ్వడం, 66% జనాభా ఉన్న అరబ్బులకి 43% భూభాగం కేటాయించడం సహజంగానే పాలస్తీనా లోని అరబ్బులకి, వారికి మద్దతిచ్చే అరబ్ దేశాలకి అస్సలు నచ్చలేదు. ఈ తీర్మానం ఏకపక్షంగా ఇజ్రాయేల్ కి లాభం చేకూర్చేలా ఉందని పాలస్తీనా తో పాటు ఇతర అరబ్ దేశాలు అభిప్రాయపడ్డాయి, తీర్మానాన్ని తిరస్కరించాయి.
3. ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవలంటే – ఇజ్రాయేల్ కి కేటాయించిన 56% భూభాగం సుమారు 14,000 చదరపు కిలోమీటర్లు. అంటే నెల్లూరు జిల్లా భూభాగానికి సమానం. అలాగే పాలస్తీనా కి కేటాయించిన 43% భూభాగం సుమారు 11,000 చదరపు కిలోమీటర్లు అంటే దాదాపు గుంటూరు జిల్లా భూభాగానికి సమానం.
4. యూదులకు కంటిన్యూస్ గా ఉండే భూభాగాన్ని ఇజ్రాయేల్ దేశం గా కేటాయించి, పాలస్తీనా కి మాత్రం తూర్పు భాగంలో వెస్ట్ బ్యాంక్ ప్రాంతం, పశ్చిమ భాగంలో గాజా ప్రాంతం అంటూ కంటిన్యూస్ గా లేని ముక్కలను పాలస్తీనా దేశంగా కేటాయించడం కూడా పాలస్తీనా వాసులకి, అరబ్ దేశాలకి ఏ మాత్రం నచ్చలేదు.
అంతర్యుద్దం, ఉద్రిక్తతల నడుమ నూతన ఇజ్రాయేల్ దేశం ఏర్పాటు:
ఈ తీర్మానానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. అమెరికా, రష్యా సహా అనేక పాశ్చాత్య దేశాలు దీనికి మద్దతు ఇచ్చినప్పటికీ, అరబ్ దేశాలు – ముఖ్యంగా ఈ ప్రాంతానికి పొరుగున ఉన్న సిరియా, జోర్డాన్, లెబనాన్, ఈజిప్టు లు మరియు పాలస్తీనా నాయకులు దీనిని నిర్ద్వందంగా తిరస్కరించారు, మొత్తం మీద ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా ఒక అంతర్యుద్ధమే జరిగింది. మర్డర్లు, లూటీలు, దాడులు, నెత్తుటి ధారలు నిత్య కృత్యాలు అయిపోయాయి. మరి కొద్ది కాలం లో రానున్న మొదటి అరబ్-ఇజ్రాయేల్ యుద్దానికి Precursor లా మారిన ఈ పరిస్థితుల నడుమ – 14 మే 1948 లో ఇజ్రాయిల్ తమని తాము ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవడం, అమెరికా వంటి కొన్ని దేశాలు ఇజ్రాయిల్ ను నూతన దేశంగా గుర్తించడం చకచకా జరిగిపోయాయి.
ఇజ్రాయేల్-పాలస్తీనా సమస్య కి – ఈ తీర్మానం, తద్వారా జరిగిన ఇజ్రాయేల్ దేశ ఏర్పాటు క్లైమాక్స్ కాదు. కేవలం ఇంటర్వల్ బ్యాంగే. ఎందుకంటే ఇక్కడి నుండే అసలు కథ మొదలైంది. ఆధునిక ప్రపంచ చరిత్ర లోని పలు కీలక మలుపులకి- ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల intersection లో ఏర్పడ్డ ఈ నూతన దేశం – కేంద్ర బిందువు గా మారింది. Act-2 లోని సెకండాఫ్ ని, సెకండాఫ్ లోని Act-2 ని అది మరింత జటిలమైన చిక్కు ముడిగా చేసింది.
(సశేషం)
– జురాన్ (@CriticZuran)
Also Read చరిత్ర పుటలు: ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం, కారణాలు, సమగ్ర విశ్లేషణ (పార్ట్-1)
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-2) : ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఒక యూదా రాజ్యం
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-3) : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనా ప్రాంతం గా ఎలా మారింది ?
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -4): మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఆధీనంలోనికి ఈ ప్రాంతం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -5) : మొదటి ప్రపంచ యుద్ధాంతర పరిస్థితులు, హిట్లర్, యూదుల ఊచకోత
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -6) : రెండో ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ ఏర్పాటుకి మార్గం సుగమం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 8): పాలస్తీనా శరణార్థుల సమస్య
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 9): ఆరు రోజుల యుద్ధం , శిబిరాల్లో శరణార్థుల జీవితం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-10): యాసర్ అరాఫత్ అను ఒక విరోధాభాసం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-11): ఓస్లో ఒప్పందాలు, పాలస్తీనా విమోచన, అరాఫత్ ప్రభుత్వం