శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (ఇస్రో) నుండి ఈరోజు సాయంత్రం ప్రయోగించిన జి.ఎస్.ఎల్.వి.డి-6 విజయవంతం అయింది. దీని ద్వారా 2117కేజీలు బరువున్న ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈరోజు అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహం ద్వారా దేశంలో మరింత మెరుగయిన టీవీ, మొబైల్స్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు ఇస్రో ప్రయోగించిన సమాచార ఉపగ్రహాలలో అమర్చిన యాంటీనాల కంటే ఇందులో పెద్ద యాంటీనా (ఆరు మీటర్ల వ్యాసం) అమర్చారు. దీనిలో మొత్తం 10ఎస్ బ్యాండ్ ట్రాన్స్ పాండర్లు అమర్చారు. రూ. 250కోట్ల వ్యయంతో దేశీయంగా నిర్మించబడిన ఈ ఉపగ్రహం సుమారు 12సం.ల పాటు సేవలందిస్తుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు అనేకమంది ఇస్రో శాస్త్రజ్ఞులను అభినందించారు.