టీకా ఉత్సవ్ అంటూ.. ఉత్సవాలు చేస్తున్నారు కానీ.. టీకాలు మాత్రం కావాల్సినన్ని పంపడం లేదని కేంద్రం వైఫల్యాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజల ముందు పెడుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు టీకాల కోసం ఆయన నేరుగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేసి టాం.. టాం చేశారు. ఈ లేఖలు కూడా.. కేంద్రం నుంచి టీకాల లోడు వస్తుందని తెలిసిన తర్వాతనే రాశారు. టీకా ఉత్సవ్ ప్రారంభసమయానికి ఏపీలో టీకా నిల్వలు అతి తక్కువ ఉన్నాయి. అప్పుడు.. సీఎం జగన్ టీకాలు కావాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు. నిజానికి ఆ తర్వాతి రోజే.. ఆరున్నర లక్షల టీకాల డోసులు ఏపీకి పంపిస్తున్నట్లుగా కేంద్రం నుంచి ప్రభుత్వానికి సమాచారం ఉంది. అయినప్పటికీ.. జగన్ లేఖ రాశారు.
అలా వచ్చిన టీకాల్ని ఆంధ్రప్రదేశ్ అధికారులు ఒక్క రోజులో అందరికీ వేసేశారు. తాము రికార్డు స్థాయిలో ఒక్క రోజే ఆరున్నర లక్షల మంది టీకాలు ఇచ్చామని ప్రకటించుకున్నారు. కానీ తర్వాత మూడు రోజుల పాటు ఒక్క టీకా కూడా వేయలేకపోయారు. కారణం ఏ జిల్లాలోనూ టీకా స్టాక్ లేకపోవడమే. మళ్లీ ప్రభుత్వం శనివారం ఐదు లక్షల టీకాల డోసుల్ని పంపించబోతోందని అధికారికంగా కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. ఇలా సమాచారం అందిన వెంటనే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ప్రధాని మోడీకి లేఖ వెళ్లింది. కరోనా కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటున్నామని.. టీకా ఉత్సవ్‌ను బాగా నిర్వహిస్తున్నామని.. కానీ టీకాల కొరత ఉందని.. వెంటనే పంపాలని ఆ లేఖ సారాంశం.
శనివారం ఐదు లక్షల డోస్‌లు వస్తాయని తెలిసి కూడా జగన్ రాజకీయం కోసం.. ప్రజల దృష్టిలో మరో రకమైన ప్రచారం జరగడం కోసమే రాశారని బీజేపీ నేతలు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి దేశవ్యాప్తంగా కరోనా టీకా కొరత ఉంది. అందుబాటులో ఉన్న రెండే టీకాలు కావడంతో.. వాటి ఉత్పత్తి పరిమితంగా ఉండటంతో… ఉత్పత్తి అయిన టీకా మొత్తాన్ని అవసరాన్ని బట్టి రాష్ట్రాల వారీగా సర్దుబాటు చేస్తున్నారు. అయినా జగన్ హడావుడిగా లేఖలు రాస్తూ.. టీకా లేకపోవడం తమ తప్పు కాదని..మోడీ తప్పన్నట్లుగా లేఖల ద్వారా ప్రచారం చేస్తున్నారని.. కొంత మంది బీజేపీ నేతలు అసంతృప్తికి గురవుతున్నారు.