స్తానిక ఎన్నికల్లో 90 శాతం సీట్లలో గెలవాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం నిర్దేశించారు. అప్పుడే.. వీలైనన్ని ఏకగ్రీవాలకు ప్రయత్నించండి అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అంతే.. కట్టలు తెగినట్లుగా అయిపోయింది వైసీపీ నేతల ఆరాటం. ఫలితం.. దాడులు… దౌర్జన్యాలు మీడియాలో విస్తృతంగా హైలెట్ అవుతున్నాయి. మాచర్ల దాడుల తర్వాత.. రాష్ట్రం మరో బీహార్‌గా మారిపోయిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. 151 సీట్లు వచ్చాయి. ఇలాంటి విజయం సాధించిన పార్టీ.. స్థానిక ఎన్నికల్లోనూ అదే హవా చూపించడానికి అవకాశం ఉంటుంది. దానికి దాడులు.. దౌర్జన్యాల అవసరం లేదు. ప్రత్యర్థి పార్టీల నేతలు పోటీలో ఉండకుండా… చేయాల్సిన ఆగత్యం కూడా లేదు. ఎవరి మానాన వారు పోటీ చేసినా… ప్రజలు.. పట్టం కడతారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తేనే… అసలైన గెలుపు. దాడులు చేసి..భయపెట్టి.. ప్రత్యర్థుల్ని పోటీలో ఉండకుండా చేయడం ద్వారా తెచ్చుకునే గెలుపు ప్రజలు ఇచ్చేది కాదు. అది ప్రజాస్వామ్య విరుద్ధం. కానీ ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. నామినేషన్లు వేయనివ్వడం లేదు.. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. ఏ ప్రభుత్వం అయినా.. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి.. తమ సమర్థతను చాటాలనుకుంటుంది. కానీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో ఎంత చెడ్డపేరు వచ్చినా.. తాము గెలవాలనుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమయ్యేలా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు.
వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు చేసి ప్రత్యర్థి పార్టీని పోటీలో లేకుండా చేయాలనుకోవడం వల్ల… వైసీపీకి గెలుపుపై నమ్మకం లేకుండా పోయిందనే అభిప్రాయం .. ఏర్పడటానికి చాన్సిచ్చినట్లవుతోంది. సాధారణ ఎన్నికల్లో వచ్చిన విజయంపై నమ్మకం ఉంటే.. స్థానిక ఎన్నికలు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్‌గా నిర్వహించేందుకు ప్రభుత్వం వెనుకాడేది కాదంటున్నారు. తొమ్మిది నెలల్లో పరిస్థితి మారిపోయిందని.. అధికార పార్టీ ఆందోళన చెందుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. స్థానిక ఎన్నికల ఫలితాలు కొద్దిగా తేడాగా వచ్చినా పాలనపై.. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న అభిప్రాయం బలపడుతుందన్న కారణంగానే అధికార పార్టీ దుందుడుకుగా వ్యవహరిస్తోందనుకుంటున్నారు.