చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వ్యాపించి ఉన్న శ్రీ సిటీ పారిశ్రామిక పట్టణంలో రూ. 3000 కోట్లు పెట్టుబడితో జపాన్ కి చెందిన ఇసుజు మోటార్స్ భారత్ విభాగం డి-మాక్స్ పికప్ వాహనాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దాని మొదటి దశ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇవ్వాళ్ళ నుంచి ఉత్పత్తి కూడా మొదలుపెట్టింది దానిలో తయారయిన మొట్టమొదటి వాహనం ఇవ్వాళ్ళ బయటకి వచ్చింది. మొదటి దశలో ఏడాదికి 50,000 పికప్ వాహనాలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు ఇసుజు మోటార్స్ సంస్థ ప్రెసిడెంట్ మసనోరి కటయామ తెలిపారు. రెండవ దశ నిర్మాణం పూర్తయితే ఏడాదికి 1,20,000 వాహనాలను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. భారత్ మార్కెట్ పై సుమారు నాలుగేళ్లపాటు సర్వే చేసిన తరువాతఇక్కడ మంచి వ్యాపారావకాశాలున్నట్లు గుర్తించి ఈ ప్లాంట్ నెలకొల్పామని అయన చెప్పారు. ఈ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన వాహనాలను కేవలం భారత్ లోనే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ లో 70శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని చెప్పారు. ఈ వాహనాల తయారీ కోసం అవసరమయిన కొన్ని విడిభాగాలను తయారు చేసేందుకు 120 సంస్థలతో ఒప్పందాలు చేసుకొన్నామని, వాటిలో చాలా సంస్థలు ఈ ప్రాంతంలోనే తమ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పబోతున్నాయని, వాటి ద్వారా కూడా వందలాది మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు.
శ్రీ సిటీలోనే సుమారు రూ. 1500 కోట్లు పెట్టుబడితో నెలకొల్పబడుతున్న మొండలీజ్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా రెండు రోజుల క్రితమే తన మొదటి దశ ఉత్పత్తి కార్యక్రమాలను ప్రారంభించింది. దానిలో ఏడాదికి 60,000 టన్నుల క్యాడ్ బరీస్ చాక్లెట్లు ఉత్పత్తి అవుతాయి. మొత్తం మూడు దశలలో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెడితే ఏడాదికి 2.5 లక్షల టన్నుల మిల్క్ చాక్లెట్స్, బిస్కట్లు తయారవుతాయి.