తెలంగాణలో కనిపించని అలజడి ఉంది. మూడు రోజులుగా కలకలం రేపుతోంది. కరీంనగర్లో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులపై దాడి జరిగింది. అదే సమయంలో… కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టులు చేస్తున్న కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. మూడు రోజులుగా విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఇప్పుడు సంచలనం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రధానంగా మేఘా సంస్థ చేపడుతోంది. అయితే.. పనులన్నింటినీ వివిధ భాగాలుగా విభజించి.. సబ్ కాంట్రాక్టులు ఇచ్చింది. అలా సబ్ కాంట్రాక్టులు చేస్తున్న సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. C5 ఇన్ఫ్రా, పౌలోమి ఎస్టేట్ , బృందావన్ స్పిరిట్స్ అనే కంపెనీలతో పాటు వివిధ చోట్ల.. సోదాలు జరుగుతున్నాయి.
బేగంపేట్ లోని మధుపాల టవర్స్ లో మూడు రోజులుగా ఇవి కొనసాగుతున్నాయి. ఈ సోదాల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్ పెద్ద ఎ్తతున ఈ ప్రాజెక్టు ద్వారా అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ప్రాజెక్టుకు ఎలాంటి డీపీ ఆర్ ఇవ్వకపోవడాన్ని ఎత్తి చూపారు. ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు కాళేశ్వరంలో అవినీతి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. మొత్తం బయట పెడతామని చెప్పుకొచ్చారు. అయితే.. అనూహ్యంగా బీజేపీతో ఘర్షణ వైఖరిని కేసీఆర్ మార్చుకున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.
అయితే అనుహ్యంగా కాళేశ్వరం కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు ప్రారంభమవడం… చిన్న విషయం కాదని అంటున్నారు. ఎందుకంటే… కాంట్రాక్టుల్లో కమిషన్లను చెల్లించే విధానం.. సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థ ద్వారా ఉంటుందని.. ఇక్కడ లొసుగులు పట్టుకుంటే.. మొత్తం విషయం వెలుగులోకి వస్తుందని.. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారు చెబుతున్నారు. అందుకే.. తెలంగాణలో కొత్త రాజకీయ కలకలం రెడీగా ఉందన్న చర్చ జరుగుతోంది.