వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ.. ఆ పార్టీ తరపున కొన్ని జిల్లాలను చక్క బెట్టే అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున పన్ను అక్రమాలకు పాల్పడినట్లుగా స్పష్టమైన సమాచారం అందడంతో .. దాదాపుగా ఇరవై బృందాలతో సోదాలు చేస్తున్నారు. రాంకీ గ్రూపు సంస్థల కార్యాలయాలతో పాటు హైదరాబాద్లో ఉన్న ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. రాంకీ గ్రూప్ ప్రధానంగా రియల్ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తోంది. వేస్ట్ మేనేజ్మెంట్ కార్యకలాపాలనూ నిర్వహిస్తూ ఉంటుంది. గచ్చిబౌలిలో రాంకీ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. అక్కడ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
పన్ను ఎగ్గొట్టేందుకు నకిలీ ఇన్వాయిస్లుతయారు చేశారని.. కంపెనీ జరిపిన అమ్మకాలు, కొనుగోళ్లలో తేడాలున్నట్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ వ్యూహకర్తల్లో ఒకరిగా పేరున్న అయోధ్య రామిరెడ్డిపై ఐటీ గురి పెట్టడం కలకలం రేపుతోంది. వైసీపీ పెద్దల ఆర్థిక లావాదేవీల్లో ఆయన కీలకంగా ఉంటారని అంటున్నారు. అయితే ఈ సోదాల్లో మరో కీలకమైన అంశం కూడా ఉందని అంటున్నారు. ఇటీవలి కాలంలో రాంకీ షేర్స్ ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇవి అనుమానాస్పదంగా ఉండటంతో సెబీ.. విచారణ చేయాలని ఐటీ డిపార్ట్మెంట్ని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ షేర్ల విలువ పెరగడం వెనుక ఉన్న స్కాంను ఐటీ వెలికి తీసే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
ఆయన సంస్థల్లో దొరకరానివి ఎదైనా లింకులు దొరికితే.. అది ఇతర వైసీపీ ప్రముఖులకూ చుట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్రంతో అత్యంత సన్నిహిత సంబంధాలు నిర్వహిస్తున్న వైసీపీ.. తమ పార్టీ నేతలపై దర్యాప్తు సంస్థల దృష్టి పడకుండా జాగ్రత్త పడుతూ వస్తోంది. అయితే అనూహ్యంగా ఐటీ అధికారులు ఏభారీగా టార్గెట్ చేయడం ఆసక్తి రేపుతోంది. వైసీపీ పెద్దలు కూడా.. తెర వెనుక ఏమైనా జరిగిందా అన్న కోణంలోఆరా తీస్తున్నారు.