తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని పెద్దగా పేరు లేని రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం.. ఏడాదిన్నర క్రితమే ప్రారంభమైన ఓ ఐటీ కంపెనీపై దాడి చేసి.. దాదాపుగా రూ. డెభ్బై కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా వార్తలు రాగా.. తాజాగా అలాంటి లో ప్రోఫైల్ మెయిన్‌టెయిన్ చేసే మరికొన్ని కంపెనీలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు అనంతపురం, తాడిపత్రి, బెంగళూరుల్లో కూడా సోదాలు చేస్తున్నారు.
ఈ కంపెనీలన్నీ విల్లాలు.. భారీ అపార్టుమెంట్లను నిర్మిస్తున్నాయి. కానీ భారీ ప్రచారానికి దూరంగా ఉంటాయి. పెట్టుబడులకు మాత్రం లోటు ఉండదు. వీటిలోకి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయన్నదానిపై ఐటీ అధికారులు కూపీ లాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయా సంస్థలు ఇప్పటి వరకూ ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాయి.. పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి.. లావాదేవీల సొమ్ము ఎలా మారకం అవుతుంది లాంటి అంశాలను ఐటీ అధికారులు వెలికి తీస్తున్నారు.
ఈ సోదాల్లో ఏమేమి దొరికాయన్నదానిపై స్పష్టత లేదు. ఐటీ వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. సోదాలు అన్నీ ముగిసిపోయిన తర్వాత ఎలాంటి పేర్లూ లేకుండా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ కంపెనీల వెనుక ఎవరున్నారు.. అందులోకి వచ్చి పడిన పెట్టుబడులు ఎవరివి అన్నది కూడా ఐటీ అధికారులు వెలికి తీస్తే సంచలనం అయ్యే చాన్స్ ఉంది.