విజయవాడలో ఒకేసారి ఎనిమిది ఐటీ సంస్థల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కొత్త టెక్ పార్క్ ద్వారా 500 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సైబరాబాద్‌ను మించిన సిటీని విజయవాడలో నిర్మిస్తామని అన్నారు. హైటెక్ సిటీని మించిన బ్రహ్మాండమైన వసతుల్ని ఇక్కడ క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్‌లో ముందుకు పోవాల్సిన అవసరం ఉందనీ, ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో కొంత భయం వచ్చిందనీ, ఏపీ మరో సిలికాన్ వ్యాలీగా తయారౌతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఏపీకి ఐటీ సంస్థలు ఒక్కోటిగా రావడం మంచి పరిణామమే. అయితే, ఇప్పుడు విజయవాడ కేంద్రంగా ఐటీ అభివృద్ధి జరుగుతుందన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. గతంలో ఆయన చెప్పింది ఏంటంటే… విశాఖపట్నం ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామనీ, అన్ని రకాలుగా అక్కడే అవకాశం ఉందని అనేవారు. ప్రస్తుతం ఆ వాదన వదిలేసినట్టున్నారు. ఇప్పుడు ఐటీ అంటే విజయవాడ అంటున్నారు! మరి, విశాఖ సంగతి ఏమైనట్టు..?
ఇప్పుడు, విజయవాడ రాజధాని ప్రాంతమైపోయింది. కాబట్టి, దీని చుట్టుపక్కల ప్రాంతాలు త్వరగా అభివృద్ధి చెందే అవకాశం కచ్చితంగా ఉంటుంది. అయితే, ఇదే సమయంలో అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తప్పు చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఐటీ కంపెనీలుగానీ, ఇతర పరిశ్రమలు ఏవి వచ్చినా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తూ వచ్చారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇతర నగరాల్లో అభివృద్ధి కుంటుపడింది.
రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో ఇదే విషయం చంద్రబాబు ప్రస్థావించేవారు! ఏపీలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయడంపై దృష్టిపెడతామన్నారు. ఈ క్రమంలో ఐటీకి విశాఖపట్నాన్ని హబ్‌గా మారుస్తామన్నారు. ఆ విషయాన్ని వదిలేసి ఇప్పుడు కొత్తగా విజయవాడ అంటున్నారు. అలాగని విజయవాడకు పరిశ్రమలు రావొద్దన్నది వాదన కాదు. అభివృద్ధి విషయంలో ప్రాధాన్యతాక్రమాలను మార్చేస్తూ ఉండటం కరెక్ట్ కాదు కదా! వైజాగ్‌లో ఐటీకి అనుకూల వాతావరణం ఉన్నప్పుడు అక్కడే దృష్టి పెట్టాలి. సంస్థల దృష్టిని అటువైపే మళ్లించాలి కదా!