కన్నడ సినిమాలు బ్లాక్ బస్టర్ అయి.. భారీ వసూళ్లు సాధించినట్లుగా… కన్నడ సూపర్ స్టార్లపై.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో కూడా… కళ్లు తిరిగే కలెక్షన్లు బయట పడ్డాయి. మూడు రోజుల పాటు.. 180 మంది ఐటీ అధికారులు… ముఫ్పైకి పైగా స్థానాల్లో నిర్విరామంగా చేసిన సోదాలలో నోట్ల కట్టలు .. కట్టలుగా బయటపడ్డాయి. రూ. 109 కోట్ల రూపాయల నగదు, 25 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరి దగ్గర ఎంత ఎంత పట్టుబడ్డాయన్నదానిపై వివరణాత్మక ప్రకటన జారీ చేయలేదు కానీ… కర్ణాటక-గోవా ఐటీ రీజియన్ అధికారులు మాత్రం బ్లాక్ బస్టర్ కలెక్షన్లు చూశారు.
కేజీఎప్ హీరో యష్ దగ్గర్నుంచి కిచ్చా సుదీప్, సూపర్ స్టార్ రాజ్ కుమార్ ఇద్దరు కుమారులు, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ లాంటి స్టార్లపై జరిగిన దాడుల్లో… ఎవరూ ఊహించనంత మొత్తం బయటపడింది. ఈ దాడులు సహజంగానే కలకలం రేపాయి. దాడుల విషయం తెలిసిన తర్వాత షూటింగుల్లో ఉన్న నటులు ఇంటికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఐటీ అధికారులకు అందుబాటులోనే ఉన్నారు. సోదాలు ముగిసిన తర్వాత తాము ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించారు. కానీ.. ఐటీ అధికారులు మాత్రం.. అఫీషియల్‌గా రూ. 109 కోట్ల నగదు, 25 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని చెప్పుకొచ్చారు. సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు, ఆడియో రైట్స్, ఇంటర్నెట్ రైట్స్ లాంటి వాటి లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు చెబుతున్నారు.
అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుని నోటీసులు ఇచ్చారు. రేపో మాపో వారిపై… కేసులు నమోదు చేస్తారని ప్రచారం జరుగుతోంది. నెలల తరబడి… కసరత్తు చేసి సమాచారం సేకరించిన తర్వాత దాడులు చేశామని.. ఐటీ అధికారులు చెబుతున్నారు. బహుశా.. అంతంతమాత్రం బడ్జెట్లు ఉండే కన్నడ పరిశ్రమలోనే అంత మొత్తం దొరికితే… సినిమా బడ్జెట్ వంద కోట్ల వరకూ చేరిన తెలుగు, తమిళ సినిమా హీరోలు, నిర్మాతల దగ్గర ఇంకెంత ఉండాలి..? ఈ దిశగా.. ఐటీ అధికారులు అంతర్గత కసరత్తు చేయకుండా ఉంటారా..? ఏమైనా జరగొచ్చు..! తెలుగు, తమిళ ప్రముఖులపై దాడుల గురించి.. త్వరలోనే వార్తలు రావొచ్చేమో..?