అరెస్ట్ అయిన చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో వరుసగా రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రదర్శనలు అంతకంతకూ పెరిగిపోతూండటంతో శుక్రవారమే ఆంక్షలు విధించారు. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో మరింత పెరుగుతాయన్న ఉద్దేశంతో పోలీసులతో నోటీసులు ఇప్పించారు.
హెచ్ ఆర్ లకూ పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ పోలీసులు ఎలాంటి సంఘిభావ ప్రదర్శనలు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నారు. ఈ నిరసలేమీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రదర్శనలు కాదు. కానీ తమకు ఆప్తమిత్రుడైన పొరుగు రాష్ట్రానికి వ్యతిరేకంగా జరుగుతున్నవి కావడంతో అక్కడి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కట్టడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు.. మరో వైపు బెంగళూరులో ఐటీ ఉద్యోగులు కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు. బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన నరిసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువకులు తరలి వచ్చారు.
టీడీపీ సానుభూతిపరులు, ఐటీ ఉద్యోగులు తరలి వచ్చారు. అయితే పోలీసులు ఎవరికీ ఆంక్షలు పెట్టలేదు. సాఫీగా కార్యక్రమం సాగిపోయింది. మధ్యలో కొంత మంది వైసీపీ సానుభూతి పరులు .. కార్యక్రమం ఆగిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాంటి ఫేక్ న్యూస్ ను ఎవరూ పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరో వైపు విజయవాడలో అయితే పూర్తి స్థాయి నిర్బంధం నిర్వహించారు. విజయవాడ ఇంజినీరింగ్ కాలేజీలకు పోలీసులు మధ్యాహ్నం నుంచి సెలవులు ప్రకటించారు. ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు నిరసనలకు ప్లాన్ చేస్తున్నారని తెలియగానే.. హడావుడిగా పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. కాలేజీలను ఉన్న పళంగా మూయించేసి ఇంటికి పంపించారు. ఎవరైనా నిరసన ప్రదర్శనలు చేపడితే ఊరుకునేది లేదన్నారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతుగా ఎవరైనా ప్రదర్శన నిర్వహిస్తే అణిచివేస్తున్నారు. అక్రమ కేసులో అరెస్టు చేసిన చంద్రబాబును విడుదల చేయాలని.. ప్రతీ రోజూ అనేక చోట్ల సడెన్ ధర్నాలు జరుగుతున్నాయి. అవి అంతకంతకూ పెరిగే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.