సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీట నొక్కే కార్యక్రమాలను బహిరంగసభలుగా నిర్వహిస్తున్నారు. అయితే ఆ సభలకు జనాలను సమీకరించడం.., సభ అయ్యే వరకూ వారిని కదలకుండా కూర్చోబెట్టడం అధికారులకు వైసీపీ నేతలకు పెద్ద సవాల్‌గా మారింది. అది రాజకీయ పార్టీ సభ కాకపోవడంతో వైసీపీ నేతలు పెద్దగా జన సమీకరణ చేయడం లేదు. అధికారులే పథకాల లబ్దిదారులను తీసుకొస్తున్నారు. బలవంతంగానో.. బెదిరించో..బామాలో తీసుకు వస్తున్నారు కానీ ఉంచలేకపోతున్నారు.
సీఎం చెప్పిన సమయానికి వస్తే సమస్యే ఉండదేమో కానీ రెండు, మూడు గంటలు ఆలస్యంగా వస్తున్నారు. ఫలితంగా అసహనానికి గురవుతున్నారు. సీఎం ప్రసంగం స్టార్ట్ చేసే వరకూ ఉండి… హమ్మయ్య ఇకహాజరు వేయించుకున్నా చాలనుకుని లేచి వెళ్లిపోతున్నారు. మొన్న తిరుపతిలో ఇవాళ ఉంగుటూరులోనూ ఇవే సీన్లు రిపీట్ అయ్యాయి. మీడియాలోనూ విస్తృత ప్రచారం జరిగింది. వైసీపీ నేతలు చెప్పుకునే వ్యతిరేక మీడియా ఇలాంటి వాటిని ఎందుకు వదిలి పెడుతుంది.
ఉంగుటూరులో సభ ప్రాంగణం చాలా వరకూ ఖాళీగా ఉంది. వచ్చిన వాళ్లు కూడా మధ్యలోనే వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితులపై వైసీపీ నేతలు రివ్యూ చేసుకోవాల్సి ఉంది. లేకపోతే… జగన్ ప్రసంగాలను వినేందుకు జగన్ ఆసక్తి గా లేరని.. ప్రజలు ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పటికే గడపగడపకీ ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కువ ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిలదీతల వీడియోలే కనిపిస్తున్నాయి.