రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక్క ప్రకటన చాలు. పంట పండించుకుంటారు. ఇలాంటి ఓ ప్రకటన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవల చేశారు. అంతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు..రాత్రికి రాత్రే తమ మాయా ప్రపంచాన్ని సృష్టించారు. హైదరాబాద్ శివారులోని పుప్పాలగూడ ప్రాంతంలో 450 ఎకరాల్లోఐటీ పార్క్ కడతామని భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆయన అలా ప్రకటించిన వెంటనే.. రియల్ వ్యాపారులు కనీసం ఇరవై శాతం ధరలు పెంచేశారు.
నిజానికి పుప్పాలగూడ.. ఐటీ కారిడార్ లోనే ఉంటుంది. కాకపోతే నివాస ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, ఇతర సొసైటీలకు కేటాయించిన సుమారు 200 ఎకరాల భూమిని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ భూమిని ఐటీ హబ్ కోసం ఉపయోగించనున్నారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు చెందిన 250 ఎకరాలను కూడా ఈ ప్రాజెక్ట్‌కు కలిపి అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ ఐటీ హబ్ నిర్మిస్తే.. ఐటీ కార్యాలయాలు వచ్చి మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్ లాభాలను ఇప్పుడే పిండుకునేందుకు రియల్టర్లు సిద్ధమయ్యారు.
ప్రస్తుతం పుప్పాలగూడ ప్రతిపాదిత ఐటీ హబ్ చుట్టుపక్కల అపార్టుమెంట్లలో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నప్పటికీ ధరలు పెంచేందుకు రియల్టర్లు వెనుకాడటం లేదు. అయితే కొనుగోలుదారులు తెలుసుకోవాల్సింది ఒక్కటే..ఇప్పటికి ప్రభుత్వం ప్రకటన మాత్రమే చేసింది. అక్కడ ఐటీ హబ్ నిర్మించి.. ఐటీ కంపెనీలు తీసుకు వచ్చే సరికి ఏళ్లు పడుతుంది. ఇప్పుడు పెట్టే ధరలకు.. అప్పటికీ పెద్దగా మార్పు ఉండదు. ఈ మధ్య కాలంలో పెట్టుబడి అంతా.. స్థిరంగా ఉంటుంది.అందుకే ప్రభుత్వ ప్రకటనలను చూపి మాయ చేసి రేట్లు పెంచే రియల్టర్లు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.