వివిధ రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా భాజపా సంస్కరణలు చేపట్టింది. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వచ్చే రెండున్నరేళ్లను దృష్టిలో పెట్టుకుని పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నవారికి అవకాశాలు ఇచ్చే దిశగా భాజపా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తోంది. బీహార్లో ప్రస్తుతం మంగల్ పాండే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన స్థానంలో ఎంపీ నిత్యానందరాయ్కి బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీలో ఎంపీ మనోజ్ తివారీకి అవకాశం ఇచ్చారు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా రాష్ట్రాలకు భాజపా కొత్త అధ్యక్షులను నియమిస్తున్నారు. ఉన్నవారి స్థానంలో కొత్తవారిని మార్చుతున్నారు. కానీ, ఏపీకి సంబంధించి ఎలాంటి ప్రకటనా జరగడం లేదు! ఆంధ్రా విషయంలో భాజపా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉందని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు ఉన్నారు. ఆయన అందరికీ కావాల్సిన వారు! అంటే, మిత్రపక్షమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆయన అనుకూలంగా ఉంటారు. అలాగే, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో కూడా అత్యంత సన్నిహితంగా ఉంటారని చెబుతారు! సో… ఏపీలో ఇంత ‘కీలకమైన’ హరిబాబును అధ్యక్షపదవి నుంచి తప్పించడం అంటే… ఎన్నో అడ్డంకులు దాటుకుని భాజపా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి, హరిబాబును మార్చాలని అధిష్టానం భావిస్తున్నా… ఆంధ్రా నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయనీ, ఆయన్ని కొనసాగించాల్సిన పరిస్థితి భాజపాకి ఏర్పడిందని కూడా కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. హరిబాబును మార్చడం కేంద్రమంత్రి వెంకయ్యకూ ఇష్టం లేదు, చంద్రబాబుకూ ఇష్టం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
సో.. దీంతోపాటు రాష్ట్రంలో ఇతర కుల సమీకరణలు ఆయన్ని మార్చేందుకు అడ్డుపడేట్టుగా మారినట్టు సమాచారం! ఏదైతేనేం ఏపీ భాజపా మీద చంద్రబాబు పట్టు బాగానే ఉందని మరోసారి నిరూపితమైంది. నిజానికి, వచ్చే ఎన్నికల్లో ఏపీలో సొంతంగా పోటీ చేయాలన్నది భాజపా లక్ష్యం. కానీ, ఆ పార్టీ ఎదుగుదలకు పరోక్షంగా చంద్రబాబు అడ్డు పడుతున్నారన్న విమర్శ ఏపీ భాజపా వర్గాల నుంచి ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉంది! దీనికి తోడు పార్టీకి సంబంధించి కీలకమైన వ్యక్తిగా ఉండాల్సిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, చంద్రబాబుతో దోస్తీకే ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఏపీ భాజపా అభివృద్ధికి అవరోధంగా మారిందనే విమర్శలు కూడా ఉన్నాయి! ఏదైతేనేం, ఈ ఇద్దరు మిత్రులూ కేంద్రంలోని భాజపాని ప్రభావితం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.