పాకిస్ధాన్, బంగ్లాదేశ్ లలో మాదిరిగా ఉగ్రవాదానికి ప్రజలు ఆదరించే పరిస్ధితి ఇంతవరకూ భారతదేశంలో లేదు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అగ్రరాజ్యాలూ, అగ్రరాజ్యాల దాష్టీకాన్ని తుడిచిపెట్టడానికి ఉగ్రవాద సంస్ధలూ కలబడిపోతున్న వాతావరణం లో ఒక విధంగా భారతదేశానిది తటస్ధ పాత్రే. ఈధోరణికి భిన్నంగా అగ్రరాజ్యాలతో గొంతు కలిపి పెద్దగా అరవడం భారతదేశానికి ఎంతో కొంత నష్టమే అవుతుంది.
శుక్రవారం రాత్రి పారిస్‌లో ఫ్రాన్స్, జర్మనీ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులపైనా, నృత్యసంగీత ప్రదర్శనలు జరుగుతున్న ఒక థియేటర్‌పైనా, ఎనిమిది మంది ఐఎస్ఐఎస్ జిహాదీలు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 127 మందిని చంపివేశారు, రెండు వందలమందికి పైగా గాయపరిచారు.
పారిస్ లో జరిగిన ఈ దాడినుంచైనా పాఠాన్ని నేర్చుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనలలో ఉగ్రవాదం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, తదితర దేశాలతో కలిసి ఉగ్రవాదాన్ని మట్టుపెడతామంటూ ప్రకటనలు చేస్తున్నారు. యూరప్ సాంస్కృతిక ఔన్నత్యానికి ఫ్రాన్స్ ను ఒక ఐకాన్ గా ప్రపంచం చూస్తుంది. ఫ్రాన్స్ బహుళత్వాన్ని ఆదరించే దేశం. అన్ని దేశాలవారినీ, అన్ని మతాలవారినీ ఆదరించే సంస్కృతి ఆ దేశంలో వుంది. అగ్రరాజ్యాలతో చేతులు కలిపినందుకే ఫ్రాన్స్ మీద ఐఎస్ఐఎస్ జీహాదీలు ప్రతీకారం తీర్చుకున్నారని మరచిపోకూడదు.
సిరియాలో యుద్దవిమానాలు ప్రయోగిస్తూండటానికి ప్రతీకారంగానే పారిస్ లో తాను దాడులు చేసినట్టు ఐఎస్ఐఎస్ ప్రకటించింది. ఆదేశాధ్యక్షుడు బషార్ అల్ అస్సద్ ను పదవినుంచి దించేసే లక్ష్యంతో ఐఎస్ఐఎస్ సిరియాలో హింసాకాండ సాగిస్తోంది. అస్సద్‌ను రష్యా, ఇరాన్‌లు బలపరుస్తున్నాయి. అమెరికా, నేటో కూటమి అస్సద్‌నూ, ఐఎస్ఐఎస్నూ ఒకేసారి ఓడించే లక్ష్యంతో దాడులు జరుపుతున్నాయి. అస్సద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్లకు అమెరికా, దాని మిత్రదేశాలు సహాయసహకారాలూ అందిస్తున్నాయి.రష్యా యుద్దవిమానాలు అస్సద్ వ్యతిరేక స్ధావరాలను ధ్వంసం చేస్తున్నాయి. పారిస్ దాడలకు ఇదే నేపధ్యం. తటస్ధతత పాటించకుండా అగ్రరాజ్యాలతో చేతులు కలపడమే ఫ్రాన్స్ – ఐఎస్ఐఎస్ లక్ష్యంగా మారడానికి ఒక కారణం.
2001 సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్ లోని బిజినెస్ టవర్స్ మీద అల్‌కాయిదా ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్, బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్‌ల ప్రతీకార చర్యలే ఐఎస్ఐఎస్ పుట్టుకకు దారి తీశాయి.
అఫ్ఘానిస్తాన్‌లో సోవియెట్ యూనియన్ ప్రారంభించిన ఆధిపత్య పోరు అమెరికా, పాకిస్తాన్‌లు కలసి తాలిబాన్‌ను తయారు చేయడానికీ, అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియెట్ యూనియన్ నిష్ర్కమణకూ, ఆ దేశంలో తాలిబాన్ పాలనకూ దారి తీసింది. ఇరాక్‌లో అత్యధిక భాగం ఇస్లామ్ రాజ్య స్థాపన కోసం పోరాడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో వుంది. చమురు నిక్షేపాలపైన ఉగ్రవాద సంస్థ ఆధిపత్యం వల్ల నిధులకు కానీ ఆయుధాలకు కానీ కొరత లేదు. ఇస్లామ్ రాజ్య విస్తరణలో భాగంగా సిరియాలో ఉగ్రవాదులు యుద్ధమే చేస్తున్నారు.
భారతదేశానికి సంబందించిన పరిణామాల్లో ముంబై మారణకాండకు సూత్రధారి అయిన పాకిస్తాన్ ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్ నీ, ముంబై అల్లర్లకు బాధ్యుడైన దావూద్ ఇబ్రహీంనీ ఇండియాకు అప్పగించి తీరాలని అమెరికా, బ్రిటన్ దేశాలు పాకిస్తాన్‌పైన ఒత్తిడి తీసుకురావడం లేదు. పైగా పాకిస్తాన్‌కు అమెరికా ఆర్థిక సహాయం, ఆయుధ సహాయం చేస్తూనే ఉన్నది.
న్యూయార్క్ లో దాడికి లేదా ప్యారిస్‌లో దాడికి స్పందించినంత తీవ్రంగా ముంబైలో దాడికి అమెరికా స్పందించలేదని మరచిపోకూడదు. విదేశాంగ నీతిని నిర్ణయించే ముందు వాస్తవాలతో పాటు క్రమంలో బహుళ మతాలూ, భాషలూ, సంస్కృతుల జన్మభూమి అయిన ఇండియా సాస్కృతిక నైతిక అస్ధిత్వాలను మరచిపోకూడదు. ఆచితూచి మాట్లాడాలి. అదేసమయంలో భారత్ లోని ముస్లింల నమ్మకాన్నీ భద్రతనీ చెక్కుచెదరకుండా చూసుకోవాలి.