రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎప్పుడూ పక్కా వ్యూహం ప్రకారమే ఉంటాయి..! అవి కక్ష సాధింపులు చర్యలే అని అందరికీ తెలుస్తున్నా… అలాంటి విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ప్రణాళికల అమలు ఉంటుంది. తాజాగా టీడీపీ ప్రముఖలపై జరుగుతున్న ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడుల వెనక వ్యూహం కూడా దాదాపు ఇలానే కనిపిస్తోంది. ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదురు తిరిగిన దగ్గర్నుంచీ…రాజకీయంగా ఏదో ఒక కవ్వింపు చర్యలు భాజపా నుంచి ఉంటాయని అందరూ ఊహిస్తూ వచ్చినవే. దాని తగ్గట్టుగానే తాజా ఐటీ దాడులు అనే అభిప్రాయం కూడా కలుగుతోంది. ఐటీ దాడుల్ని ఎవ్వరూ వ్యతిరేకించడం లేదుగానీ… దీన్ని ఒక వ్యూహాత్మక కక్ష సాధింపు మాధ్యమంగా వాడుకుంటున్నారేమో అనే ఆవేదన కలుగుతోంది. ఇలాంటి విమర్శకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే, ముందుగా టీడీపీ నేతల్ని ఐటీ అధికారులు టచ్ చేయలేదా అనే అనుమానమూ కలుగుతోంది!
ఈ మధ్య కొన్ని వందల మంది అధికారుల ఒకేసారి విజయవాడకు చేరుకోవడం, ఆ తరువాత వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలు, వ్యాపారవేత్తలపై ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, టీడీపీ ప్రముఖ నేతలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టారు! ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… ముందే నేరుగా టీడీపీ నేతలే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ఉంటే… పెద్ద ఎత్తున విమర్శలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి, ముందుగా ఇతరులపై ఐటీ దాడులు జరిపి, ఆ తరువాత టీడీపీ నేతలవైపు వస్తే… ఇదో రొటీన్ ప్రక్రియలో భాగంగానే టీడీపీ నేతలపైనా దాడులు చేశారు అని సమర్థింపుగా మాట్లాడే ఆస్కారం ఉంటుంది కదా!
ఇంకోటి… ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో కర్ణాటక తరహా వ్యూహాన్నే ఆంధ్రాలో కూడా అమలు చేసేందుకు భాజపా సిద్ధమౌతున్నట్టూ కనిపిస్తోంది. ఆ మధ్య కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా మద్దతుగా నిలిచే ప్రముఖులను నియంత్రించే ప్రయత్నం ఇలానే జరిగింది. ఏపీలో కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి అన్ని రకాలుగా సాయపడే సామర్థ్యం ఉన్నవారు అనుకున్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకునే తాజా చర్యలు జరుగుతున్నట్టు భావించొచ్చు. అయితే, ఈ సందర్భంలో ప్రజల్లో విమర్శలు పాలుకాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే… ముందుగా కొంతమంది ఇతర వర్గాలకు చెందినవారిపై ఐటీ దాడులు, ఆ తరువాత టీడీపీ నేతలు! ఇప్పుడు కూడా సీఎం రమేష్.. ఆ వెంటనే, మరో టీడీపీ నేత కాకుండా వేరే ఇంకొకరిపై ఐటీదాడులు.. ఆ తరువాతి లక్ష్యం మరో టీడీపీ నేత… ఇదే వ్యూహంగా కనిపిస్తోంది. ‘టీడీపీ నేతలనే కాదు.. ఇదిగో సో అండ్ సో వారిపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి’ అని చెప్పుకునేందుకు ఆస్కారం ఉంచుకోవాలి కదా.