సోనూసూద్ ఆఫీసుల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు రూ. 20కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లుగా మీడియాకు లీక్ ఇచ్చారు. సోనుసూద్ విదేశీ నిధులను తీసుకోవడంలో ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఐటీ అధికారులు ప్రకటించారు. మూడు రోజుల పాటు ముంబయి, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గురుగ్రామ్ సహా 28 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. కవలం సోనుసూద్ మాత్రమే కాకుండా ఆయనకు సంబంధించిన వ్యక్తుల ఇళ్లలోనూ సోదాలు చేశారు.
ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిశాడు సోనూసూద్. ఢీల్లి ప్రభుత్వం ఆయనను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. అయితే ఈ క్రమంలో సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పుకార్లు వచ్చాయి. అంతకు ముందు ఏకంగా ముంబయి మేయర్గా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దింపుతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే తాను రాజకీయాల్లో రానని చాలా సార్లు సోనుసూద్ ప్రకటించారు.
కరోనా తర్వాత సోనుసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రభుత్వాలు కూడా చేయలేదన్న అభిప్రాయం ఉంది. కష్టాల్లో ఉన్నామంటూ ట్వీట్లు చేసిన ఎందరికో సాయంచేశాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సోనూ సూద్ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వానికి కూడా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయించాడు. చాలా మందికి ఆర్థికంగా సాయం చేశాడు. అయితే అలా సాయం చేయడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని కొంత మంది నేతలు ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఐటీ దాడుు కలకలం రేపాయి.