జేసీ సోదరుల ఇళ్లపై హఠాత్తుగా ఈడీ గురి పెట్టింది. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు తాడిపత్రిలోని జేసీ సోదరుల ఇళ్లతో పాటు చవ్వా గోపాల్ రెడ్డి అనే కాంట్రాక్టర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏ వ్యాపారంలో ఫిర్యాదులు వచ్చాయన్నదానిపై స్పష్టత రాలేదు. వచ్చీ రాగానే కుటుంబ సభ్యుల ఫోన్లు తీసేసుకుని సోదాలు ప్రారంభించారు. సోదాల సమయంలో జేసీ బ్రదర్స్ ఇంట్లోనే ఉన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆఫ్రికాలో కూడా పలు వ్యాపారాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయేమో స్పష్టత లేదు. అదే సమయంలో ఆయనకు ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిపై ఉక్కుపాదం మోపారు. ఈ కారణంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులు ఇప్పుడు కనిపించడం లేదు. అయితే గతంలో అశోక్ లేల్యాండ్ కంపెనీకి చెందిన బస్సులు అక్రమంగా రిజిస్టర్ చేశారన్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఆ కేసు కు ఈశాన్య రాష్ట్రాలతో సంబంధం ఉండటంతో ఈ కోణంలోనూ ఏపీ పోలీసుల నుంచి ఫిర్యాదు వెళ్లడంతో ఈడీ సోదాలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
జేసీ బ్రదర్స్ వ్యాపారాలు వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత కుప్పకూలిపోయాయి. వారి మైనింగ్, ట్రాన్స్ పోర్ట్ సహా ఏ వ్యాపారమూ సరిగ్గా జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనపై ఈడీ దాడులకు దిగడం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఇటీవల సునీల్ దేవధర్ లాంటి వాళ్లు జేసీ ప్రభాకర్ రెడ్డితో సమావేశం అయ్యారు. బీజేపీ చేరమని ఆఫర్ ఇచ్చారు. అయితే వారు కాదన్నారని అందుకే ఈడీ వచ్చిందన్న చర్చ తాడిపత్రిలో జరుగుతోంది.