వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్ భారీ స్కామ్‌కు పాల్పడిందని ఇన్‌కంట్యాక్స్ శాఖ గుర్తించింది. అసలు నష్టాలు రాకుండా రూ. 1200 కోట్లు నష్టాలు వచ్చినట్లుగా డాక్యుమెంట్లు సృష్టించినట్లుగా గుర్తించారు. అలాగే లెక్క చూపని రూ. 300 కోట్ల నగదును గుర్తించారు. ఇంకా.. సింగపూర్‌లోని ఓ సంస్ధకు రాంకీకి చెందిన ఆస్తులను అమ్మినట్లుగా చూపించారని ఐటీ శాక వెల్లడించింది. అయితే ఎగ్గొట్టిన పన్నును చెల్లించేందుకు రాంకీ సంస్థ అంగీకరించిందని.. ఐటీ శాఖ తెలిపింది. ఐటీ శాఖ ఎక్కడా తాను విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో రాంకీ సంస్థ పేరు వెల్లడించలేదు.
మామూలుగా సోదాలు చేసినప్పుడల్లా వివరాలు వెల్లడిస్తే.. ఐటీ శాఖ సంస్థల పేర్లు బయట పెట్టదు. కానీ ఆ సంస్థ చేసిన సోదాలను బట్టి అందరికీ తెలిసిపోతుంది. ఆరో తేదీన హైదరాబాద్‌లోని ప్రముఖ సంస్థలో సోదాలు చేసినట్లుగా చెప్పడంతో అది రాంకీనేనని సులువుగా తెలిసిపోయింది. పన్ను ఎగ్గొట్టేందుకు కృత్రిమ నష్టాలు చూపెట్టడం… ఆస్తులను సింగపూర్ కంపెనీకి అమ్మినట్లుగా లెక్కలు రాయడం..ఇప్పుడు సీరియస్ కేస్ అయ్యే అవకాశం ఉంది. ఎగ్గొట్టిన పన్నులు కడతామని కంపెనీ అంగీకరించిందని ఐటీ ఓశాఖ చెబుతున్నప్పటికీ.. ఇంకా దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలిపింది.
అంటే.. ఈ కేసు ఇంతటితో ఆగదని.. దీని వెనుక చాలా కోణాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. విదేశాలకు తరలించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి.. వాటిని మళ్లీ ఇండియాకు ఎలా తీసుకు వచ్చారు వంటి అంశాలను కూడా ఐటీ శాఖ దర్యాప్తు చేసి బయటకు తీసే అవకాశం ఉంది. మరో వైపు సెబీ కూడా.. రాంకీ సంస్థ షేర్ల పై ఆరా తీస్తోంది. ఈ గుట్టంతా బయటపడితే.. చాలా పెద్ద సంచలనమే వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.