మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐదో రోజూ…సోదాలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇంత సుదీర్ఘంగా ఏ పారిశ్రామిక వేత్త ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేయలేదు. కానీ మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాపై మాత్రం కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి ప్రత్యేక ఐటీ అధికారుల బృందం రావడమే కాదు.. మూడు రోజుల పాటు ..స్థానిక ఐటీ అధికారులకు కూడా అవకాశం ఇవ్వలేదు. అయితే.. ఆ తర్వాత స్థానిక ఐటీ అధికారుల సహకారంతోనే సోదాలు కొనసాగిస్తున్నట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ బాలానగర్లో ఉన్న మేఘా ప్రధాన కార్యాలయం వద్ద.. కేంద్ర బలగాలు ఉన్నాయి. అదే సమయంలో.. కంపెనీ యాజమాన్యం.. ప్రైవేటు భద్రతను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంది.
సోదాలు జరుగుతున్న సమయంలో.. మేఘా కృష్ణారెడ్డిని కూడా పిలిపించినట్లుగా చెబుతున్నారు. రెండు, మూడు రోజుల నుండి… మేఘా కార్యాలయంలోనే ఉండి… ఐటీ అధికారులకు కావాల్సిన సమాచారాన్ని … అనుమానాలను.. మేఘా కృష్ణారెడ్డి తీరుస్తున్నారని చెబుతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఐటీ అధికారులు బయటకు వెళ్లి వస్తూండటంతో.. మేఘా వ్యాపార కుటుంబానికి చెందిన వారి లాకర్లు, ఇతర అంశాలను సరి చూసివస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
మేఘా కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులు ఉంటున్నప్పటికీ.. ఎవరికీ చిన్న సమాచారం అందకుండా మేఘా కృష్ణారెడ్డి అనుచరులు జాగ్రత్త పడుతున్నారు. మీడియాను వీలైనంత దూరం తరిమేందుకు ప్రత్నిస్తున్నారు. ఐదు రోజుల పాటు సోదాలు జరుగుతున్నాయంటే… కచ్చితంగా ఏదో ఓ బ్రేకింగ్ న్యూస్ ఉంటుందని మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి.