ఆంధ్రప్రదేశ్ పై ఐటీ అధికారులు దండయాత్ర ప్రారంభించారు. నిన్న అర్థరాత్రి పెద్ద సంఖ్యలో… విజయవాడ చేరుకున్న ఐటీ అధికారులు.. ఎక్కడ సోదాలు చేయబోతున్నామో ఎవరికీ చెప్పలేదు. కానీ పోలీసులను మాత్రం సెక్యూరిటీ అడిగారు. వారు ఉదయమే.. ముందుగా మంత్రి నారాయణకు చెందిన సంస్థలను టార్గెట్ చేశారు. నారాయణ విద్యాసంస్థల కార్యాలయాలయాల్లో తనిఖీలుచేశారు. అలాగే .. సదరన్, వీఎస్ లాజిస్టిక్స్ అనే కంపెనీలు.. జగ్గయ్యపేట దగ్గర ఉన్న బ్రిక్స్ తయారీ కంపెనీల్లోనూ సోదాలు చేపట్టారు. కొద్ది రోజుల నుంచి ఏపీలోనూ ఐటీ దాడులు జరగబోతున్నాయన్న ప్రచారం ఉద్ధృతంగానే సాగుతోంది. దానికి తగ్గట్లుగానే… విజయవాడలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులన్నీ.. రాజకీయ లక్ష్యాలను గురి చేసుకునే ఉంటున్నాయి. మంత్రి నారాయణ మాత్రమే కాదు.. తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న ఓ సామాజికవర్గానికి చెందిన ముఖ్యుల సంస్థలను.. ఐటీ అధికారులు టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందర్భంగా.. అక్కడ రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికి ఐటీ యంత్రాంగం అంతా ఆయన మీదే దృష్టి కేంద్రీకరించింది. మూడు రోజుల సెర్చ్ వారెంట్ తెచ్చుకుని ఆయనను ఇంట్లోనే ఉంచింది. ఆ తర్వాత ఐటీ ఆఫీసులకు రావాలని సమన్లు జారీ చేస్తున్నారు. కానీ ఈ సోదాల్లో ఏమి దొరికాయో మాత్రం ఇంత వరకూ ప్రకటించలేదు. రేవంత్ ను సోదాలు, ప్రశ్నల పేరుతో ఇంట్లో కూర్చొబెట్టిన సమయంలో.. బయట కొందరు ఐటీ పేపర్ల పేరుతో కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు రిలీజ్ చేసి దుష్ప్రచారం చేశారు. వాటిపైనా ఐటీ వివరణ ఇవ్వలేదు. ఐటీ దాడుల వ్యవహారం మొత్తం భయాందోళనలు కల్పించడానికి చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐటీ అధికారుల్ని రాజకీయ ప్రత్యర్థుల్ని గురి పెట్టడం దక్షిణాదిలో గత కొన్ని నెలలుగా జరుగుతోంది. కర్ణాటక, తమిళనాడులో… అధికారులంతా… బీజేపీ చెప్పే రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపై సోదాలకే సమయం వెచ్చిస్తున్నారు. తెలంగాణలో.. ఇప్పుడు ఏపీలో కూడా ప్రారంభమయింది. కానీ నోట్ల రద్దు సమయంలో.. గుజరాత్ కోపఆపరేటివ్ బ్యాంకుల్లో వేల కోట్లు డిపాజిట్ అవడంపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అమిత్ షా కుమారుడు.. జై షా … నాలుగేళ్లలో అపర కుబేరుడైపోయారు. వీటిపై ఎన్ని విమర్శలు వచ్చినా… ఐటీ దాడి కాదు కదా.. ఒక్క నోటీసు కూడా వారికి వెళ్లలేదు. ఉత్తదాది ఐటీ అధికారుల లాబీ అంతా దక్షిణాదిపైనే గురి పెట్టినట్లుగా ఉందన్న విమర్శలు రాజకీయవర్గాల్లో చురుగ్గానే వినిపిస్తున్నాయి.