మైహోమ్ గ్రూప్ అధినేత, ఇటీవలి కాలంలో పలు టీవీ చానళ్లను కొనుగోలు చేసి.. మీడియా రంగంలోనూ బలమైన ముద్ర వేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు ఇంట్లో ఐటీ దాడులు సోదాలు జరుపుతున్నారు. అత్యంత రహస్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రియల్టర్ గా… మహా సిమెంట్ కంపెనీ ఓనర్‌గా.. జూపల్లి రామేశ్వరరావు అందరికీ సుపరిచితులే. మైహోమ్ గ్రూప్ ను ఆయన నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో.. ఆయన మీడియాపై దృష్టి పెట్టారు. ఇతరులతో కలిసి 10టీవీ,టీవీ9, మోజో టీవీలను కొనుగోలు చేశారు.
ఇవన్నీ వివాదాస్పదం అయ్యాయి. 10టీవీని కమ్యూనిస్టు పార్టీ నేతలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించి ఏర్పాటు చేశారు. అయితే.. వీరికి అమ్మేయడం వివాదాస్పదమయింది. ఇక టీవీ9 వ్యవహారం ఎంత వివాదాస్పదం అయిందో అందరికీ తెలిసిందే. టీవీ9 నుంచి ఉద్వాసనకు గురైన.. రవిప్రకాష్.. కోర్టులో.. జూపల్లి రామేశ్వరరావుపై బ్లాక్ మనీ ఆరోపణలు చేశారు. ఈక్రమంలో.. ఆయనపై ఐటీ దాడులు జరగడం… ఆశ్చర్యకర పరిణామమే. పైగా.. జూపల్లి రామేశ్వరరావు.. తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులు. ఓ రకంగా రాజ గరువు అనే ప్రచారం ఉంది. రవిప్రకాష్.. తెలంగాణ సర్కార్ తనను ఇబ్బంది పెడుతోందన్న ఉద్దేశంతో… బీజేపీ పెద్దల సాయాన్ని కోరారన్న ప్రచారం..సోషల్ మీడియాలో జరిగింది. ఈ క్రమంలోనే పరిణామం చోటు చేసుకోవడం ఆశ్చర్యకరమే.
ఇటీవలి కాలంలో… టీఆర్ఎస్ నేతలపై కానీ… ప్రభుత్వానికి దగ్గరగా ఉండే పెద్దలపై కానీ.. ఐటీ దాడులు జరగలేదు. తొలిసారి.. కేసీఆర్ కు అత్యంత సన్నిహితునిగా పేరు పడిన రామేశ్వరరావుపైనే … ఐటీ దాడులు జరగడంతో.. బీజేపీ నుంచి వచ్చిన తొలి వార్నింగ్ గా భావిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల తర్వాత బీజేపీ – టీఆర్ఎస్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని రాజకీయ పరిణామాలు కూడా నిరూపిస్తున్నాయి. ముందు.. ముందు… ఈ ఐటీ దాడుల వ్యవహారం.. సీరియల్‌గా కొనసాగే అవకాశం ఉందని..మరికొంత మంది జూపల్లి రామేశ్వరరావు సన్నిహితులపైనా దాడులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.