కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఉదయం నుంచి రేవంత్‌తో పాటు.. ఆయన బంధువుల ఇళ్లలో ఈ తనిఖీలు సాగుతున్నాయి. ఓటుకు నోటు కేసులో.. రూ. 50 లక్షలను.. స్టీఫెన్సన్ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని అప్పట్లో ఐటీ అధికారులకు అందించారు. ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై.. అప్పట్లో పోలీసులు విచారణ చేశారు. ఆ సమయంలోనే… రేవంత్‌కు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దానికి ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా రేవంత్‌రెడ్డితో పాటు అతడి సోదరుల ఇళ్లలోనూ సోదాలు ప్రారంభించారు. హైదరాబాద్‌తో పాటు కొడంగల్ ఇంట్లోనూ.. ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాలు జరుగుతున్న చోట్ల కుటుంబసభ్యుల ఫోన్లను అధికారులు స్విచ్ ఆఫ్ చేయించారు.
తనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించబోతున్నారని.. దీని కోసం ఇప్పటికే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీజేపీ పెద్దలతో మాట్లాడారని… కొద్ది రోజుల కిందట రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనికి తగ్గట్లుగానే… ఇప్పుడు ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడులు చేశారు. మూడున్నరేళ్ల కిందటి కేసులో ఇప్పుడు ఇళ్లలో సోదాలు చేస్తే ఏమి తెలుస్తుందని.. రాజకీయ నేతలు… ఆశ్చర్యపోతున్నారు. కానీ అసలు విషయం మాత్రం.. ఎన్నికల ముందు.. కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీయడానికి… ఎన్నికల సన్నాహాల్లో భాగంగా.. రేవంత్ ఏవైనా… నిధులు సమకూర్చుకుని ఉంటే… పట్టుకోవడానికి ఈ సోదాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ జూబ్లీహిల్స్ పోలీసులు రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు పధ్నాలుగేళ్ల కిందటి కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం కలకలం రేపింది. అదే సమయంలో…నిన్నామొన్న వచ్చిన నయీం కేసులు… డ్రగ్స్ కేసులను పక్కన పెట్టేసి… కాంగ్రెస్ నేతలపై పాత కేసులను బయటకు తీసి వేధింపులకు పాల్పడుతున్నారనే విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి.