నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామకృష్ణంరాజు ఇళ్లపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌లోని ఎమ్మార్ బౌల్డర్ హిల్స్‌లో ఉన్న ఆయన విల్లాలో సోదాలు చేశారు. పవర్ ప్రాజెక్టుల పేరుతో.. పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడంతో… సీబీఐ కేసు నమోదయింది. ఈ కేసులో చెన్నై సీబీఐ అధికారులు సోదాలు చేశారు. కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడైన.. రఘురామకృష్ణం రాజు.. ఇండ్ భారత్ పవర్ పేరుతో.. పలు రాష్ట్రాల్లో కంపెనీలు పెట్టారు. పవర్ ప్రాజెక్టులు కడుతున్నామంటూ.. వివిధ రుణ సంస్థల నుంచి రూ. 3 వేల కోట్లు రుణాలు తీసుకున్నారు. దాదాపుగా పన్నెండు కంపెనీలు ఉన్నాయి.
విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తామంటూ… భారత్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ , రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ , ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రూ. వెయ్యి కోట్లు రుణాలు తీసుకున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రాజెక్టులు నిర్మించలేదు. తీసుకున్న రుణాలన్నీ దారి మళ్లించారు. ప్రాజెక్టుల్లో 20 శాతం కూడా నిర్మాణం కాలేదు. ఈ రుణాలు 2016లోనే మొండి బకాయిలుగా మారాయి. ఈ సంస్థ ఫిర్యాదు మేరకు.. రఘురామకృష్ణంరాజుపై.. ఢిల్లీలో కేసు నమోదు అయింది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన అసెట్ మెనేజ్ మెంట్ కంపెనీ.. మెక్క్వరీ కూడా.. దాదాపుగా రూ. 800 కోట్లు ఇండ్ భారత్ కంపెనీలు ఎగ్గొట్టాయని భారత కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసి ఉన్నాయి.
రఘురామకృష్ణం రాజు పెట్టిన కంపెనీల్లో ఓ రెండు కంపెనీలు.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న రూ.167 కోట్ల రుణం తిరిగి చెల్లించడంలో విఫలమమయ్యాయి. సరఫరా చేసిన బొగ్గుకు జరపడంలో విఫలమయ్యాయని గాంధార్ ఆయిల్ రిఫైనరీ కూడా.. కోర్టుల్లో కేసులు దాఖలు చేసింది. రుణాలు ఇచ్చిన కంపెనీలన్నీ… ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై తదితర చోట్ల కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఈ కేసుల్లో సీబీఐ సోదాలు చేసింది. కొద్ది రోజుల క్రితం.. టీవీ 9కి ఇంటర్యూ ఇచ్చిన రఘురామకృష్ణంరాజు.. ఎగ్గొట్టాను అయితే ఏంటని నేరుగానే ప్రశ్నించి .. సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.