రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వారికి కోపం వస్తే్ సీఐడీల్ని ప్రయోగిస్తారు కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి కోపం వస్తే… ఐటీ, ఈడీ, సీబీఐ లాంటివి ప్రయోగిస్తారు. ఎవరి మీద అన్నది కూడా ముందూ వెనుకా చూసుకోరు. తాజాగా బీబీసీ పైనా ఐటీ దాడులు చేసేశారు. ఇండియాలో బీబీసీకి ఢిల్లీ, ముంబైలలలో ఆఫీసులు ఉన్నాయి. వాటిపై ఒక్కో చోట అరవై మందికిపైగా ఐటీ అధికారులు ఎటాక్స్ ప్రారంభించారు. ఆఫీసులోకి వెళ్లిన వెంటనే ఉద్యోగులు అందరి దగ్గర సెల్ ఫోన్లు తీసుకుని .. సోదాలు ప్రారంభించారు.
ఈ అంశం సహజంగానే ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఎందుకంటే ఇటీవల బీబీసీ గుజరాత్ లో గోద్రా అల్లర్లకు సంబంధించిన ఓ డాక్యుమెంటరీని బీబీసీ ఆన్ లైన్లో విడుదల చేసినప్పటి నుండి కేంద్రం ఆగ్రహంతో ఉంది. ఇప్పుడు ఐటీ దాడులతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. భారత్లోపత్రికా స్వేచ్చపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు బీబీసీపై దాడులతో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకే ఇండియాలో ఇన్ని బెదిరింపులు.. వేధింపులు ఉన్నప్పుడు ఇక లోకల్‌గా ఉండే మీడియా పరిస్థితేమిటో ఊహించుకోవచ్చని కొంత మంది అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఓ వైపు అదానీ వివాదం నడుస్తోంది. రోజు రోజుకు అదానీ షేర్లు పతనమవుతున్నాయి. అదానీ వ్యవహారంపై విచారణ చేయడానికి కూడా కేంద్రం ఆసక్తి చూపించడం లేదు. సెబి విచారణ అంటున్నారు కానీ ఎప్పుడు జరుగుతుందో.. నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయో ఎవరికీ తెలియదు. కానీ..బీబీసీపై మాత్రం ఐటీ దాడులు చేశారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ తెలుగు, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో డిజిటల్ మీడియంను నిర్వహిస్తోంది. తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియాలపై కేంద్రం ఇలా కక్ష సాధింపుతో ఐటీ, ఈడీలను ప్రయోగించడం అనేది చాలా కాలంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి.