ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరినీ ఉపేక్షించని అసహనం ఇటు రాష్ట్రం.. అటు కేంద్రంలోనూ కనిపిస్తోంది. తాజాగా.. బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారిగా పేరున్న బాలీవుడ్ ప్రముఖులపై ఇన్‌కంట్యాక్స్ దాడులు చేసింది. ఐటీ కన్ను పడిన వారిలో అనురాగ్ కశ్యప్, తాప్సీ పన్ను, వికాస్ భల్ తో పాటు ుసైఫ్ అలీఖాన్‌కు చెందిన ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థకు సంబంధించిన వ్యక్తులపైనా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అనురాగ్ కశ్యప్, తాప్సీ పన్ను బీజేపీ విధానాలను వ్యతిరేకించే విషయంలో తమను తాము కంట్రోల్ చేసుకోరు. ధైర్యంగా విమర్శిస్తూనే ఉంటారు. అందుకే వీరిపై కంగనా రనౌత్ లాంటి వారు ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడతారు. అనురాగ్ కశ్యప్ మరింత దూకుడుగా ఉంటారు. గతంలో అనురాగ్ కుమార్తెను అత్యాచారం చేస్తామని కొంత మంది బెదిరించారు కూడా అయినప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గలేదు. తమ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు.
బీజేపీకి మద్దతుగా ఉండే బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒక్కరిపై కూడా ఐటీ దాడులు జరగలేదు. సెలక్టివ్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవారిపైనా జరగడంతో పక్షపాతం స్పష్టంగా కనిపిస్తోంది…బీజేపీయేతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఐటీ దాడులను ఖండించింది. రాజకీయాలు.. కక్ష సాధింపుల కోసం చాలా కాలంగా సీబీఐ, ఐటీ, ఈడీలను బీజేపీ వాడుకుంటోందని మండిపడింది. బీహార్ నేత తేజస్వియాదవ్ కూడా అవే విమర్శలు చేశారు. దేశంలో కేంద్ర విచారణ సంస్థలు బీజేపీ అనుబంధ సంఘాలుగా మారిపోయాయని విపక్ష పార్టీలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీల వారిని వెంటాడటం.. బీజేపీతో సన్నిహితంగా ఉన్న వారిని లైట్ తీసుకోవడం కామన్ గా మారుతోంది. తృణమూల్ నేతలపై సీబీఐ కేసులు ఉన్న వారు అందరూ బీజేపీలో చేరిపోయారు.
అలా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతోంది. ఇప్పుడు సెలబ్రిటీలు తమకు వ్యతిరేకంగా నోరెత్తకుండా… కేంద్ర సంస్థల్ని వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ సర్కార్ తో గొడవలెందుకని.. అత్యధిక శాతం బాలీవుడ్ ప్రముఖులు.. అవసరం లేకపోయినా బీజేపీ సర్కార్ ను పొగుడుతూ వస్తున్నారు. పొగడటం ఇష్టం లేని వారు అభిప్రాయాలను వ్యక్తం చేయడం మానేశారు.