గ్రూప్ వన్ అధికారి నుంచి ఐఏఎస్ అయి.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పెద్దలకు సన్నిహితుడిగా ముద్రపడి.. వీఆర్ఎస్ తీసుకుని మరీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన వెంకట్రామిరెడ్డి ఐటీ గుప్పిట్లో చిక్కినట్లుగా కనిపిస్తోంది. ఆయన ఇంట్లో గత నాలుగు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏదో మతలబు లేకపోతే ఐటీ అధికారులు ఇన్ని రోజులు సోదాలు నిర్వహించరు.
ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ రాజపుష్ప పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ స్థాపించి లగ్జరీ అపార్టుమెంట్లు, విల్లాలు అమ్మడం ప్రారంభించారు. ఇప్పుడు ఆయన కుటుంబసభ్యులు వేసిన ఓ వెంచర్ లోనే వెంకట్రామిరెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన వ్యాపారం అంతా లొసుగుల మయం అనిప్రభుత్వం నుంచి తక్కువకే భూములు పొందారని రేవంత్ రెడ్డి లాంటి నేతలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఎప్పుడూ ఐటీ దాడులు జరగలేదు. ఈ సారి మాత్రం సీరియస్ గా సాగుతున్నాయి.
రాజపుష్ప ప్రాపర్టీస్ తో పాటు వెర్టెక్స్, ముప్పా రియల్ ఎస్టేట్ , వసుధ ఫార్మా ఇలా కొన్ని కంపెనీల్లోనూ సోదాలు నిర్వహించారు. ఇవన్నీ ఇంటర్ లింకింగ్ అనే ఆరోపణలు ఉన్నాయి. అన్ని చోట్లా సోదాలు సీఆర్పీఎఫ్ బలగాల భద్రత మధ్య సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సన్నిహితంగానే ఉండటంతో.. ఈ ఐటీ దాడుల్లో రాజకీయ కోణం ఉందని ఎక్కువ మంది భావిస్తున్నారు.