తెలంగాణ బీజేపీ ఆపరేషన్ ప్రారంభమయినట్లుగానే కనిపిస్తోంది. బీజేపీ అసలు రంగంలోకి దిగే ముందు మిత్రపక్షాలు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాయని కొంత కాలంగా సెటైర్లు వినపడుతూనే ఉన్నాయి. ఆ మిత్రపక్షాలు ఎవరో కాదు సీబీఐ, ఐటీ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఇప్పుడు తెలంగాణలో ఐటీ అధికారులు పనులు మొదలు పెట్టినట్లుగా రెండు రోజుల నుంచి హైదరాబాద్‌లో తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీని టార్గెట్ చేసుకుని నిర్వహిస్తున్న సోదాలతో ఓ అంచనాకు వస్తున్నారు.
కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద వివిధ ప్యాకేజీల పనులు చేస్తోంది. దాదాపుగా రూ. పదివేల కోట్ల విలువైన పనులు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సంస్థ ఎప్పుడూ ప్రచారంలోకి రాలేదు. గుట్టుగా పని చేసుకుంటూ పోతుంది. వరంగల్‌కు చెందిన ఈ సంస్థ యజమానికి .. టీఆర్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడుఈ సంస్థ అకౌంట్స్ లోటుపాట్లన్నీ బయటకు తీస్తున్నారు. ఏదో లేకపోతే.. సంస్థ పని చేసే సైట్స్లోనూ సోదాలు చేయాల్సిన అవసరం ఏముంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ముందుగా తాము టార్గెట్ చేసిన అధికార పార్టీ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడం.. మరెవరు ఆ పార్టీకి ఆర్థిక మద్దతు ఇవ్వకుండా చేసి.., ఆ తర్వాత బీజేపీ ప్రత్యక్షంగా రాజకీయ రంగంలోకి దిగుతుందన్న అభిప్రాయం ఉంది. ఆ ప్రకారం చూస్తే ఇప్పటికి బీజేపీ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసిందనుకోవాలి. ముందు ముందు ఈ దాడులు పెరుగుతాయి. ఇవి చాలా ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. మొత్తంగా బీజేపీ ఆట మొదలు పెట్టినట్లేనని తెలంగాణ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.