కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అసహనం పెరిగిపోతోందా..? రాజకీయ ప్రత్యర్థులపై వరుసగా కేసులు, ఐటీ దాడులు జరగడమే కాదు.. ఇప్పుడు ఏకంగా మీడియాపైనా.. ఐటీ అస్త్రాన్ని ప్రయోగిస్తూంటే.. ఇదే అనుమానం అందరికీ వస్తోంది. కొద్ది రోజులుగా రాఫెల్ స్కాం వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. దాదాపుగా ప్రతి రోజూ.. రాఫెల్లో స్కాం జరిగిందనడానికి… దానిలో నేరుగా.. మోడీ ప్రమేయం ఉందన్నవిధంగా.. ఒక్కో సాక్ష్యం బయటకు వస్తోంది. చివరికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా.. ఆ ఒప్పందంతో తనకేమీ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడటం ప్రారంభించారు. ఇప్పటికే… జాతీయ మీడియా 90 శాతం బీజేపీకి అనుకూలంగా మారింది. భయపెట్టో… తాయిలాలు ఇచ్చో.. ఆ స్థితికి తీసుకు వచ్చారు. కానీ ఆ పది శాతం మీడియా మాత్రం… నిజాలు నిర్భయంగా బయటపెడుతూనే ఉంది. తాజాగా… ఇలాంటి మీడియా సంస్థలపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి.
క్వింట్ న్యూస్ పోర్టల్, నెట్వర్క్18 వ్యవస్థాపకుడు రాఘవ్ బహల్ నివాసం, కార్యాలయంలో ఆదాయ పన్ను విభాగం సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేశారంటూ.. నోయిడాలోని ఆయన ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. మోడీ ప్రభుత్వంపై.. క్వింట్ న్యూస్లో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కథనాలు వస్తున్నాయి. ప్రత్యేకించి.. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల వ్యవహారంలో మోదీ సర్కారును తప్పుబడుతూ క్వింట్ న్యూస్లో పలు కథనాలు వచ్చాయి. సోదాల సమయంలో ఐటీ అధికారులు వ్యహవరించిన తీరు కూడా కలకలం రేపుతోంది. రాఘవ్ భార్య ఫోన్ లాక్కుని..భయోత్పాతం కల్పించేలా వ్యవహరించారు. తన తల్లి, భార్యను ఎవరితోనూ మాట్లాడకుండా నిరోధించారని రాఘవ్ ఆరోపించారు.
క్వింట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రీతూ కపూర్ ఇంటిపైనా ఐటీ దాడులు జరిగాయి. ఈ సోదాలను ఎడిటర్ గిల్డ్ ఖండించింది. ఐటీ విభాగం తమ అధికారాలకు లోబడి పనిచేయాలే తప్ప ప్రభుత్వ విమర్శకులను భయపెట్టేలా వ్యవహరించకూడదని వ్యాఖ్యానించింది. ఈ దాడులు పత్రికా స్వేచ్ఛపై కొరడా ఝుళిపించడమేనని ఇండియన్ ఆమ్నెస్టీ వ్యాఖ్యానించింది. కేంద్రంపై వాస్తవాలు రాస్తున్నందుకే బహుమతిగా క్వింట్పై దాడులు నిర్వహించారని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ దుయ్యబట్టారు.కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కూడా క్వింట్పై దాడులను ఖండించారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏమాత్రం జంకని అతికొద్ది మీడియా ప్రముఖుల్లో రాఘవ్ ఒకరు. కొసమెరుపేమిటంటే.. ప్రభుత్వాన్ని వ్యతిరేకంచే మీడియా సంస్థలపై ఆరోపణలు వస్తే.. ఇలాంటి దాడులే జరుగుతాయన్నట్లు… కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడటం… మరింత వివాదానికి కారణం అవుతోంది.