తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన కార్యాలయాలు, యజమానుల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఐటీ అధికారులు మేఘా కృష్ణారెడ్డితో పాటు… కార్యాలయాలు, ఇతర చోట్ల… సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో భారీ ఎత్తున లావాదేవీలు నిర్వహించినప్పటికీ… ఆ స్థాయిలో.. లెక్కలను మేఘా కంపెనీ చూపడం లేదన్న ఫిర్యాదుల మేరకు ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇవన్నీ సాధారణంగా జరిగే ఐటీ దాడులేనని.. పెద్దగా విశేషం కానీ.. ఫిర్యాదులు కానీ ఏమీ లేవని.. మేఘా కంపెనీ.. మీడియాకు పంపిన సందేశంలో పేర్కొంది. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సాధారణ ఐటీ దాడులైనా.. హాట్ టాపిక్‌గా మారే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మేఘాపై ఐటీ సోదాలతో అధికార పార్టీల్లో ఉలికిపాటు..!?
మేఘా ఇంజినీరింగ్ కంపెనీ.. తెలంగాణలో కాళేశ్వరంతో పాటు పలు ప్రధాన ప్రాజెక్టుల కాంట్రాక్టులను చేపడుతోంది. అలాగే.. ఎలక్ట్రిక్ బస్సులను కూడా.. టీఎస్ఆర్టీసీ తరపున నడుపుతోంది. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కాంట్రాక్టును కూడా… మేఘాకే ఇప్పగించబోతున్నారు. ఈ మేరకు రివర్స్ టెండరింగ్ లో మేఘా కంపెనీ పేరును కరారు చేశారు. రూ. ఎనిమిది వందల కోట్ల తక్కువకు పనులు చేసేందుకు మేఘా కంపెనీ అంగీకరించినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో.. ఏపీఎస్ఆర్టీసీలోనూ ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టు కోసం.. ఆ సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సమయంలో ఐటీ దాడులు కాంట్రాక్టర్ల వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ కలకలం రేపుతున్నాయి.
రవిప్రకాష్ చేసిన ఫిర్యాదు మేరకేనా..?
మరో వైపు… మేఘా ఓనర్ కృష్ణారెడ్డి … మైహోమ్ కంపెనీ ఓనర్ జూపల్లి రామేశ్వరరావుతో కలిసి మీడియాలోనూ అడుగు పెట్టారు. టీవీ9 కంపెనీని వీరిద్దరూ అలంద మీడియా కంపెనీ పేరుతో కైవసం చేసుకున్నారు. దానికి సంబంధించిన వివాదాలు నడుస్తున్నాయి. మాజీ సీఈవో రవిప్రకాష్..టీవీ9 కొనుగోలు వ్యవహారంలో… మేఘా కృష్ణారెడ్డి, జూపల్లి రామేశ్వరరావులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. వీరిద్దరి ఆర్థఇక వ్యవహారాలు, బ్లాక్ మనీ తరలింపు, మనీలాండరింగ్ వంటి ఆశాలపై.. గతంలో.. సీబీఐ, ఐటీ, ఈడీ వర్గాలకు ఫిర్యాదు చేసినట్లుగా.. రవిప్రకాష్ కోర్టుకే తెలిపారు. ఈ క్రమంలో ఐటీ దాడుల విషయంలో.. ఈ ఫిర్యాదు అంశం కూడా తెరపైకి వచ్చింది.
గతంలో మైహోంపై జరిగిన ఐటీ దాడులకు.. ప్రస్తుత సోదాలకు సంబంధం ఉందా..?
కొద్ది రోజుల క్రితం.. జూపల్లి రామేశ్వరరావు సంస్థలు, ఆస్తులు, ఇళ్లపైనా ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలోనూ.. రొటీన్ సోదాలు అని స్పష్టం చేశారు. అయితే.. భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలపై… ఐటీ అధికారులు వివరాలు అడిగారన్న ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి… మైహోమ్ గ్రూప్‌నకు చెందిన పలువురు అధికారులు .. ఐటీ విభాగానికి ఇంకా పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో… వ్యాపారభాగస్వాములైన… జూపల్లి రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డిల మధ్య లావాదేవీలకు సంబంధించిన ఏమైనా ఆధారాలు దొరికి ఉంటాయేమోనన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ సోదాలు… ఎప్పటి వరకూ సాగుతాయో చెప్పలేమని.. వివరాలు చెప్పడానికి కుదరదని ఐటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ సోదాల్లో సంచలన విషయాలు బయటకు రావొచ్చన్న ప్రచారం జరుగుతోంది.