తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ .. ఆస్తులు, సంస్థలపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. దాదాపు వంద మంది అధికారులు… ఆయనకు సంబంధించిన సంస్థలు, ఆస్తుల్లో సోదాలు చేస్తున్నారు. చివరికి కడప జిల్లా పొట్లదుర్తిలో ఉన్న ఇంట్లోనూ సోదాలు ప్రారంభించారు. హైదరాబాద్, బెంగుళూరుల్లో సీఎం రమేష్ బంధువుల ఇంట్లోనూ… సోదాలు చేస్తున్నారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ పేరుతో.. సీఎం రమేష్‌కు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి వేల కోట్ల టర్నోవర్ ఉంది. కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతల్ని.. . ఆ పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటారని భావిస్తున్న నేతలను ఇన్‌కంట్యాంక్స్ దాడులు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే గత వారం… ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావుల కంపెనీల్లో సోదాలు చేశారు. ఇప్పుడు సీఎం రమేష్‌ను టార్గెట్ చేశారు.
సీఎం రమేష్…కొద్ది రోజుల క్రితం పీఏసీ సభ్యుడిగా ఓటింగ్‌లో విజయం సాధించారు. పీఏసీ సభ్యుడి హోదాలో… ఏపీలో ఐటీ దాడులు ఎందుకు చేస్తున్నారంటూ… ఐటీ శాఖను ప్రశ్నించారు. ఏపీలో ఐటీ దాడులను ఏ కారణంతో చేస్తున్నారు..? ఎక్కడెక్కడ చేస్తున్నారు..? ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి..? చెప్పాలంటూ.. సీఎం రమేష్ పీఏసీ సభ్యుడి హోదాలో.. ప్రశ్నించారు. ఈ లేఖ పంపి కేవలం మూడు రోజులే అయింది. ఈ మూడు రోజుల్లోనే.. సీఎం రమేష్‌ను ఐటీ శాఖ టార్గెట్ చేసింది.
కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి నేటికి వందో రోజు పూర్తైన సందర్భంగా టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో భేటీ అవ్వాలని నిర్ణయించారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రిని ఎంపీలు కోరనున్నారు. ఇందుకోసం ఎంపీల బృందం ఢిల్లీకి చేరుకుంది. కడప ఉక్కు పరిశ్రమపై ప్రశ్నిస్తున్నందుకే సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము, తమ సంస్థలు నిరంతరం పన్నుల చెల్లిస్తున్నాయని.. ఎన్నికల ముందు కేవలం భయానక వాతావరణం సృష్టించడానికే దాడులకు పాల్పడుతోందని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు. కేంద్రం ఎన్ని చేసినా తాము భయపడబోమన్నారు.