మొన్నమధ్య జగన్మోహన్ రెడ్డి… లోటస్ పాండ్ నుంచి కదల్లేదు… ఆ తర్వాతి రోజు… ఇంటలిజెన్స్ డీజీ.. మరో ఇద్దరు ఎస్పీలు బదిలీ అయ్యారు. ఆ తర్వాత మరోసారి లోటస్ పాండ్ నుంచి బయటకు రాలేదు. టీడీపీ అభ్యర్థులపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టని వాళ్లు ఎవరూ ఉండరు. అది బహిరంగ రహస్యం. కానీ.. ఒక్క టీడీపీ నేతలను.. మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? ఐటీ, ఈడీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారంటూ టీడీపీ నేతలు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ మధ్యే టీడీపీ నేతల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. నెల్లూరులో నారాయణ, గుంటూరులో ఉగ్రనరసింహారెడ్డికి చెందిన ఆస్పత్రిపై ఐటీ అధికారులు దాడులు చేశారు.
కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. మధ్యాహ్నం ప్రొద్దుటూరులోని సుధాకర్ యాదవ్ ఇంటికి వచ్చిన ఐటీ అధికారులు… అంగుళం కూడా వదలకుండా సోదాలు చేశారు. స్టోరేజ్ కాట్స్, అల్మరాలు, బాత్ రూమ్ లు… వేటినీ వదలకుండా తనిఖీ చేశారు. ఐటీ దాడుల గురించి తెలుసుకున్న ఎంపీ సీఎం రమేష్ ప్రొద్దుటూరులోని సుధాకర్‌యాదవ్ ఇంటికి వచ్చారు. సోదాలు చేస్తున్న ఐటీ అధికారులతో వాదనకు దిగారు.. ఏ ప్రాతిపదికన సోదాలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. చివరకు ఐటీ అధికారులు సోదాలు ముగిశాయంటూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఏం దొరికిందో మీడియాకు చెప్పాలన్నా వారు నోరు మెదపలేదు. తమపై ఒత్తిళ్లు ఉన్నాయని.. చెప్పుకుని వెళ్లిపోయారు.
ఐటీ దాడుల వ్యవహారంపై చంద్రబాబు కూడా ఘాటుగా స్పందించారు. తమ మనోస్థైర్యం దెబ్బతీసేందుకే ఐటీ దాడులు చేస్తున్నారని, అయితే వేటికీ భయపడబోమని తేల్చి చెప్పారు.. తమ నేతల ఇళ్ళపై దాడులు చేయించేవారికి… తెలంగాణ నుంచి వచ్చే డబ్బులు కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో జరిగిన ఈ ఐటీ దాడులు… ఏపీలో మరోసారి కలకలం రేపాయి. టీడీపీ అభ్యర్థులకు ఎలాంటి నగదు అందకుండా… చేసే స్కెచ్ లోటస్ పాండ్‌లో చేశారన్న అనుమానాలు టీడీపీలో వ్యక్తమవుతున్నాయి.