హైదరాబాద్: ఆదాయపు పన్నుశాఖ దాడులలో నిన్న మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు రాజేందర్ రెడ్డివద్ద రు.18 కోట్లు దొరికాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మొత్తం రు.18 కోట్లు కాదని, రు.48 కోట్లని తాజా సమాచారం. బుధవారం ఉదయంనుంచి రాత్రి పొద్దుపోయేవరకు ఈ దాడులు జరిగాయని, గురువారం ఉదయం ఐటీ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకుని రాయచూర్(కర్ణాటక)లోని ఎమ్మెల్యే నివాసానికి తాళం వేసినట్లు తెలుస్తోంది.
రాజేందర్ రెడ్డి నవోదయ గ్రూప్ పేరుతో మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్, నర్సింగ్, డీఎడ్, పాలిటెక్నిక్ కాలేజిలు నడుపుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తారు. వీరి కళాశాలల్లో మెడిసిన్ సీటుకోసం రు.కోటి డొనేషన్ తీసుకుంటారని అంటున్నారు. దీనికి సంబంధించి లెక్కలు తేడాగా ఉండటంతో ఐటీ దాడులు చేశారని చెబుతున్నారు. హైదరాబాద్, బెంగళూరులనుంచి వచ్చిన ఐటీ అధికారులు ఏకకాలంలో తెలంగాణ, కర్ణాటకలలో రాజేందర్ రెడ్డికి సంబంధించిన ఇళ్ళు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు. అయితే నిన్న రు.18 కోట్లు పట్టుబడిన వార్త అన్ని మీడియా సంస్థలలో రాగా, ఈ రు.48 కోట్లు పట్టుబడిన వార్త కేవలం సాక్షి పేపర్లో మాత్రమే రావటంతో ఈ వార్తపై కొంత సందేహాలు వ్యక్తమవుతున్నాయి.