ఇంతవరకు భారత్ లో ఎన్ని కుంభకోణాలు జరిగాయో లెక్కే లేదు. అవి బయటపడిన తరువాత వాటి గురించి కొన్ని రోజులు అందరూ చర్చించుకొంటారు. కొన్ని రోజుల తరువాత దానిపై అందరూ ఆసక్తి కోల్పోతారు. తరువాత మళ్ళీ మరో కుంభకోణం..దానిపై మళ్ళీ చర్చ..మరిచిపోవడం..మళ్ళీ మరొకటి…అంతా రొటీన్. ఆ జాబితాలో ఇప్పుడు పనామా పేపర్స్ వచ్చి చేరింది. అందులో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా బచ్చన్ వంటి అందరికీ బాగా తెలిసిన పేర్లు బయటపడటంతో మళ్ళీ హడావుడి, చర్చలు, ఖండనలు అన్నీ షరా మామూలుగా జరిగిపోయాయి. ఈసారి వేసవి వేడి ఎక్కువగా ఉన్నందునేమో పనామా వేడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారం రోజులకే ఆ వేడి తగ్గిపోయింది. అయితే ఇటువంటి వ్యవహారాలలోనే ఐటి శాఖకు నాలుగు రాళ్ళూ రాలే అవకాశం కనిపిస్తోంది కనుక ఎవరు పట్టించుకొన్నా కోకపోయినా అది మాత్రం పనామా ఖాతాదారులను గుర్తుంచుకొని, అందరికీ నోటీసులు పంపుతున్నట్లు తాజా సమాచారం. భారత్ లో 500 మంది పనామా ఖాతాదారులున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రకటించి ఐటి శాఖ పని సులువు చేసింది కనుక ఆ జాబితాలో పేర్లున్న 50 మందికి నోటీసులు పంపి సంజాయిషీ కోరింది. వారి సమాధానాలు బట్టి తదుపరి చర్యలు ఉంటే ఉండవచ్చును లేకపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే విదేశాలలో నల్లదనం దాచుకొన్నవారి చేత ఆ డబ్బు అంతా కక్కిస్తానని మోడీ చేసిన శపధానికే అతీగతీ లేదు. ఆ నల్లధనాన్ని వెనక్కి రప్పించలేకపోయినా దానిని వైట్ గా మార్చుకోవడానికి దారి చూపించారు కనుకనే రాహుల్ గాంధి దానికి ‘ఫెయిర్ అండ్ లవ్లీ స్కీం’ అని పేరుపెట్టి వెక్కిరిస్తున్నారు. కనుక దీనికీ అటువంటి తరుణోపాయమేదో చూపించినా ఆశ్చర్యం లేదు. కనుక రాహుల్ గాంధి దీనికీ ఓ మంచి పేరు సెలెక్ట్ చేసి ఉంచుకొంటే బాగుంటుంది.