బాలయ్య ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతాడో ఎవ్వరూ చెప్పలేరు. కొన్ని స్పీచులు కామెడీగా ఉంటే.. ఇంకొన్ని అస్సలేం అర్థం కావు. అయితే.. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మహా కూటమి తరపున ప్రచారం చేస్తున్న బాలయ్య.. తన స్పీచులతో లేని పోని ఇబ్బందులు తెచ్చుకుంటున్నాడేమో అనిపిస్తోంది. `సారే జహాసే అచ్ఛా` ఆలపించడంలో దొర్లిన తప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఐటీ ఉద్యోగుల విషయంలోనూ బాలయ్య నోరు జారాడు. ఇటీవల బాలయ్య ఓ సభలో మాట్లాడుతూ ”చంద్రబాబు సీఎం అయ్యాకే ఐటీ ఉద్యోగులకు స్పెల్లింగ్ నేర్పించాం” అంటూ ఓ వ్యాఖ్య చేశాడు. దాంతో ఐటీ ఉద్యోగులు బాలయ్యపై మండిపడుతున్నారు.
తమని కించ పరుస్తూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సందీప్ మక్తాలా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. బాలయ్య మాటలు మరీ హాస్యాస్పదంగా ఉన్నాయని, చంద్రబాబు వల్లే ఐటీ అభివృద్ధి జరిగిందని చెప్పి ఐటీ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ఎలక్షన్ కమీషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.