ప్రత్యేకహోదా వస్తే.. ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని.. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ రెచ్చగొట్టారు. ఇప్పుడు అభివృద్ది కోసం.. మూడు రాజధానులు అంటున్నారు. తాను ముందుగా చెప్పినట్లుగా ప్రత్యేకహోదా వస్తే.. ప్రతీ జిల్లా హైదరాబాద్ అవుతుంది. అప్పుడు మూడు రాజధానుల అవసరం ఉండదు. ఇంత స్పష్టంగా ఆయనకు అవగాహన ఉన్నా… ప్రత్యేక హోదా కోసం కాకుండా… మూడు రాజధానులంటూ.. సొంత రాష్ట్రంలోనే చిచ్చు పెట్టేస్తున్నారు జగన్.
నాడు ప్రత్యేకహోదా వస్తే ప్రతీ ఊరు హైదరాబాదేనన్న జగన్..!
ప్రజలు జగన్ అడిగినట్లుగా… ఎంపీలను ఇచ్చారు. ఆయనకు తిరుగులేని మెజార్టీ ఉంది. కేంద్రంలో మూడో అతి పెద్ద పార్టీగా ఉంది. అలాంటి పార్టీలు.. తన వాయిస్‌ను ఇంటా.. బయటా ఎక్కడా వినిపించడం లేదు. రాజకీయ ప్రత్యర్థులపై మాత్రం.. నోరు చేసుకుని విరుచుకుపడే నేతలు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని మాత్రం. ఒక్క మాట కూడా అడగడం లేదు. ప్రతీ జిల్లాను.. హైదరాబాద్ చేసి.. అభివృద్ధి వికేంద్రీకరణను చేయగల స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. వారు చెప్పిన లెక్క ప్రకారం.. వారికి వచ్చిన సీట్ల ప్రకారం.. ప్రత్యేకహోదా తీసుకు రావాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఏం చెప్పి ప్రజల చేత ఓట్లేయించుకున్నారో.. దాని కోసం కనీస ప్రయత్నం చేయకపోవడం మాత్రం.. చేతకాని తనమే అవుతంది.
అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులతోనే అభివృద్ది అని ప్రచారం..!
అభివృద్ధిని వికేంద్రీకరిస్తానని.. జగన్మోహన్ రెడ్డి పాలనా కార్యలయాల్ని మూడు చోట్లకు.. విసిరేయడానికి నిర్ణయించుకున్నారు. అదే అభివృద్ది అయితే.. గతంలో ప్రత్యేకహోదా గురించి ఎందుకు అలా ప్రచారం చేశారో.. ఆయన వివరణ ఇవ్వగలరా..?. ప్రత్యేకహోదాను చంద్రబాబే వద్దన్నాడని.. దాని వల్ల అభివృద్ధి జరగడం లేదని.. హైదరాబాద్‌లో పోటీ పడలేకపోతున్నామని.. చెప్పుకొచ్చారు. ఇప్పుడు.. మూడు రాజధానుల పేరుతో.. చిచ్చు పెట్టాల్సిన అవసరం లేకుండా.. ప్రత్యేకహోదాను తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు కదా…అనే ప్రశ్న సామాన్యుల నుంచి వస్తోంది.
ప్రజల్ని ఓ మాదిరి తెలివిగ వాళ్లగా కూడా జగన్ చూడటం లేదా..?
ప్రత్యేకహోదాను జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకున్నారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి.. ఓట్లు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ వారి కళ్లకు గంతలు కట్టడానికి మూడు రాజధానుల పేరుతో రచ్చ చేస్తున్నారు. రాష్ట్రం తీవ్రంగా నష్టపోతున్న విషయం కళ్ల ముందు కనిపిస్తున్నా… ఆయన మాత్రం తాను సక్సెస్ ఫుల్‌గా ప్రజలను గొర్రెలను చేస్తున్నానన్న ఆనందంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తలతో.. ధర్నాలు, దిష్టిబొమ్మలు తగులబెట్టించడం దగ్గర్నుంచి… సోషల్ మీడియాలో.. దుష్ప్రచారాలు చేయిస్తూ… కావాల్సినట్లుగా రాజకీయం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు మరీ అంత అమాయకులుగా జగన్ ఎందుకు భావిస్తున్నారో మరి. జగన్ మార్క్ పొలిటికల్ గేమ్ గురించి బయటపడినప్పుడు ఆయన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారు.