మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ” ఐటం ” దుమారం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. బీజేపీ ఆకర్ష్ దెబ్బకు సీఎం పదవి కోల్పోయిన కమల్‌నాథ్ … అలా ఫిరాయించి.. బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవి పొంది.. ఇప్పుడు ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ మహిళా నేతను.. ” ఐటం “గా అభివర్ణించారు. ఈ ఒక్క మాట.. బీజేపీకి.. ఇతర పార్టీలకు… పెద్ద ఆయుధంగా మారిపోయింది. చివరికి చివరికి రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని కమల్‌నాథ్ తప్పుగా మాట్లాడారని అనాల్సి వచ్చింది. రాహుల్ స్పందనతో బీజేపీకి మరింత బలం వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను బహిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని అంటోంది. కమల్‌నాథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇటు జాతీయ మహిళా కమిషన్ కూడా ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ సాగుతోంది. అయితే కమల్ నాథ్ మాత్రం తన ఐటమ్ వ్యాఖ్యల్నిగట్టిగా సమర్ధించుకున్నారు. ఎవరినీ కించపరచాలనుకోలేదని చెప్పుకొస్తున్నారు. ప్రసంగిస్తున్న సమయంలో అభ్యర్థి పేరు గుర్తు రాకపోవడంతో ఐటమ్ అనే మాట వాడాల్సి వచ్చిందని కమల్‌నాథ్ వివరణ ఇచ్చారు. చెప్పుకునేందుకు ఏమీ లేకే బీజేపీ ఈ అంశంపై వివాదం చేస్తోందని ఆరోపించారు.
మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. డబ్రాలో కమలదళం తరఫున ఇమర్తీ దేవి బరిలో ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియాతోపాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆమె కూడా ఒకరు. వారి ఫిరాయింపు వల్లే రాష్ట్రంలో కమల్‌నాథ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ కోపంలో కమల్‌నాథ్ అలా వ్యాఖ్యానించారని భావిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ను ఐటమ్ విమర్శ.. డిఫెన్స్‌లో పడేసినట్లయింది.